– సంధ్య థియేటర్ కేసులో ఊరట
– బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
– షరతులతో కూడిన బెయిల్ మంజూరు
– రూ.50 వేలు, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశం
ఐకన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో, సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. అయితే, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. రూ.50వేల రూపాయలు, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప-2 సినిమా బెనిఫిట్‌షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తొక్కిసలాట సంఘటనకు బాధ్యులైన వాళ్లందరినీ నిందితులుగా చేర్చారు. వారిలో సినిమా హీరో అల్లు అర్జున్ పేరు కూడా చేర్చారు. ఇదే కేసులో డిసెంబరు 13వ తేదీన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అల్లు అర్జున్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్‌ను చంచల్గూగూడ జైలుకు తరలించారు.
ఇక, ఈ కేసును అల్లు అర్జున్ న్యాయస్థానంలో సవాల్ చేశారు. తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు.. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించారు న్యాయవాదులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. మొత్తం మీద ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఉత్కంఠకు తెర దించింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. తీర్పు నేపథ్యంలో టెన్షన్ కు గురైన అల్లు అర్జున్ అభిమానులు ఊపిరిపీల్చుచుకున్నారు.