తెలంగాణ శాసన సభలో బీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి ఆమోదయోగ్యంగా లేదన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ శాసనసభ్యులు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా? లేదంటే తమ కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అర్థం కావడం లేదన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో సమయం వృథా చేయడమేంటి? ఇక్కడ పోరాటం చేయడమేంటని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ధరణి ప్రాజెక్టులో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబంకోసమే తీసుకొచ్చారని ఆక్షేపించారు. గడిచిన పదేళ్లు తెలంగాణలో కచరా ప్రభుత్వం ఉందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి చూస్తే కేసీఆర్ కుటుంబం కోసమే అసెంబ్లీకి వచ్చినట్లుందన్నారు. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా? అని ప్రశ్నించారు.అవసరమైతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.