బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు భారీ ఊరట లభించింది. ఏసీబీ కేసులో పదిరోజుల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఏసీబీకి నిర్దేశించింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో విదేశీ సంస్థకు అడ్డగోలుగా డబ్బులు బదిలీ చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను పేర్కొనడంతో కేటీఆర్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. వాదనలు పూర్తయిన తర్వాత ఈనెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సూచించింది. అలాగే, ఈ కేసు విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈ కేసుపై దర్యాప్తు జరగాల్సిందే అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గురువారం ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. అయితే, ఈ పరిణామంపై కేటీఆర్ కంగుతిన్నారు. శుక్రవారం ఉదయమే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అరెస్ట్ చేయకుండా, విచారణ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, తనమీద నమోదైన కేసును కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదించారు. రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారని వాదనల్లో భాగంగా న్యాయవాది సుందరం ఆక్షేపించారు. నిధుల చెల్లింపులతో కేటీఆర్ లబ్ధి పొందినట్టు ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేదని ప్రశ్నించారు. కేసు కక్ష పూరితమని ఈ ఒక్క అంశమే నిరూపిస్తోందన్నారు. కేటీఆర్ పై పెట్టిన కేసులో సీపీ యాక్ట్ వర్తించదని చెప్పారు. అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాత ఇప్పుడు కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కు సంబంధించి సీజన్-9కి అగ్రిమెంట్ కుదిరిందని, సీజన్-10కి అగ్రిమెంట్ అవసరం లేదని న్యాయవాది చెప్పారు. రేస్ నిర్వాహకులకు నిధులు పంపిస్తే… కేటీఆర్ పై కేసు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎఫ్ఈఓ సంస్థకు రెండు విడతలుగా నిధులు చెల్లించారని… మూడో విడత చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఈవో లేఖ రాసిందని… అయితే, నిధులు చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని తెలిపారు. ఎన్నికల నిబంధనను ఉల్లంఘించినట్టైతే ఈసీకి ఫిర్యాదు చేయాలని.. ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసిందని కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్‌ను ఈనెల 30వ తేదీవరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.