- బీజేపి ప్రలోభాల పర్వంపై విచారణ
- కేజ్రీ ఆరోపణలకు బీజేపి కౌంటర్
- కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ టీమ్
- ఆధారాలు చూపాలంటూ ప్రశ్నల పరంపర
- 16 మంది ఆప్ అభ్యర్ధులకు బీజేపి వల?
- మంత్రిపదవులు, రూ.15 కోట్ల చొప్పున ఆఫర్
- సోషల్ మీడియాలో కేజ్రీ ఆరోపణలపై గవర్నర్ ఆదేశాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు రాజకీయాలు మారుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపిదే గెలుపని తేల్చడంతో ఆప్ పై అప్పుడే బీజేపి యుద్దం మొదలు పెట్టేసింది. కేజ్రీవాల్ ను అష్ట దిగ్బంధనం చేస్తోంది. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్ధులతో బీజేపి బేరసారాలు చేస్తోందంటూ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ కామెంట్ ను పట్టుకుని ఢిల్లీ లెఫ్టినంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఏకంగా ఏసీబీ ఎంక్వయిరీకి ఆదేశాలిచ్చారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. ఇది బీజేపికి పరువునష్టం కలిగిస్తుందని ఎన్నికల ఫలితాలముందు ఇది తమ పరువుతీసే వ్యాఖ్యేనని ఆ పార్టీ కామెంట్ చేసింది. కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఏసీబీ టీమ్ ఆయన్ను ప్రశ్నిస్తోంది.
ప్రలోభాల ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు
బీజేపి తమ ఎమ్మెల్యే అభ్యర్ధులు 16 మందికి మంత్రిపదవులతో పాటు, ఒక్కొక్కరికి 15 కోట్లు ఇస్తామని బేరం పెట్టిందని, ఎన్నికల్లో ఓటమి భయంతో ఫలితాలను తారుమారు చేసేందుకు నడుం బిగిస్తోందని సోషల్ మీడియాలో కేజ్రీవాల్ కామెంట్ చేశారు. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు బీజేపికి 55 సీట్లోస్తాయని చెబుతున్నాయి. రెండు గంటల క్రితం ఆప్ ఎమ్మెల్యేలు 16 మందికి ఆప్ ను వీడి బీజేపిలో చేరితే మంత్రిపదవులు ఇస్తామని, ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారని హిందీలో రాసుకొచ్చారు. బీజేపి గెలిచే పరిస్థితే ఉంటే ఇలా అడ్డగోలు ప్రలోభాలకు తెర తీయదని అన్నారు. ఆప్ అభ్యర్ధులను చీల్చి అధికారం కోసం బీజేపి కుట్ర పన్నుతోందని, ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఫేకేనని అన్నారు. ఆప్ అభ్యర్ధులు ప్రలోభాలకి ఆశపడరని, పార్టీని వీడి వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.
కేజ్రీకి అతిషి సమర్దన
కేజ్రీవాల్ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కూడా సమర్ధించారు. బీజెపికి గెలిచే సీనే ఉంటే ఈ ప్రలోభాలెందుకు అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంతా తప్పేనని వీటిని ప్రకటించి ఆప్ అభ్యర్దుల్లో అయోమయం, గందరగోళం క్రియేట్ చేసి పార్టీ ఫిరాయింపులకు తెర లేపాలని బీజేపి ప్రయత్నిస్తోందని అతిషీ అన్నారు.
గవర్నర్ ఆదేశాలు… కదిలిన టీమ్
కేజ్రీవాల్ ఆరోపణలు దర్యాప్తుకు ఆదేశించదగినవని, ఏసీబీ దర్యాప్తుతోనే ఈ ప్రలోభాల వేట నిజమా కాదా అని తేలుతుందని గవర్నర్ సక్సేనాఅంటున్నారు. గవర్నర్ ప్రకటన ఇలా ఇచ్చారో లేదో క్షణాల్లో ఏసీబీ టీమ్ కేజ్రీవాల్ ముంగిట్లో వాలి ఆధారాలు చూపమంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
గెలుపెవరిది?
రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ హాట్రిక్ సాధ్య పడుతుందా లేక 27 ఏళ్ల తర్వాత బీజేపి ఢిల్లీ గద్దెనెక్కుతుందా అన్నది తేలిపోతుంది.70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 5వ తేదిన ఎన్నికలు జరిగాయి.