29.7 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్‌ అవుతోన్న పవన్‌ కల్యాణ్‌ వ్యూహాలు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా మౌనం దాల్చారు. గత ఏడాది జులైలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తనకు కేటాయించిన శాఖలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు. తనకు సంబంధించిన శాఖలలో ఏమేం జరుగుతుందో తెలుసుకునేదుకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ఐకమత్యంగా ఉంటేనే అన్నింట్లోనూ విజయం సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారని అంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఏ విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోవడం లేదంటున్నారు. కొన్నింటి గురించి పవన్‌ కల్యాణ్‌ స్పందించి వదిలేసినా.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.

మొదట తిరుమల లడ్డూ కల్తీ అంశంపై పవన్‌కల్యాణ్‌ సనాతనధర్మం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఇక్కడ విజయవాడలోనూ కనకదుర్గమ్మ గుడి మెట్లను కూడా శుభ్రంచేశారు. కాలి నడకన తిరుమల కొండ ఎక్కారు. అయితే, ఈ వ్యవహారం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ ఆరోపణలకు వ్యతిరేకంగా పవన్‌ చేసిన నిరసనలు. అయితే, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టింగ్‌లు వంటి అంశాలనూ ప్రస్తావించారు. వాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా హోంశాఖపై తన అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలు తీసుకుంటానని కూడా వపన్‌ కల్యాణ్ హెచ్చరించారు. కించపరుస్తూ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టింగ్‌లను, అవి పోస్ట్‌ చేసిన వాళ్లను పోలీసులు పట్టించుకోవడం లేదని, చూసీ చూడనట్లే వదిలేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే ఆరోపిచండంతో కూటమి ప్రభుత్వంలో ఓ మాదిరి కలకలమే చెలరేగింది. ప్రస్తుతం ప్రభుత్వంలో శాంతిభద్రతల వ్యవహారాలు సీఎం చంద్రబాబు చూస్తుండటంతో.. ఆయనను టార్గెట్‌ చేసుకొని పవన్‌కల్యాణ్‌ కామెంట్లు చేస్తున్నారని ప్రత్యర్థులు అంచనా వేశారు. కానీ, ఆ వివాదానికి చంద్రబాబు సుతిమెత్తగా ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

అటు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతెత్తున ఎగిసిపడ్డారు. కాకినాడ పోర్ట్‌ నుంచి బియ్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఏకంగా పోర్టుకే వెళ్లి.. ‘సీజ్ ది షిప్’ అని సంచలన ఆదేశాలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్రంలో కూటమి సర్కారు ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటుందో అన్న అంశాన్ని ప్రజలకు చూపించేందుకు ప్రయత్నం చేశారాయన. పేదలకు అందాల్సిన వేల కొలది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని ఎలివేట్‌ చేయగలిగారు. అయితే, ఆ అంశం కొంతమేర జనంలోకి వెళ్లిందని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్ ఆవిషయంలో సక్సెస్‌ అయ్యారని జనసేన శ్రేణులు అంటున్నారు.

ఇక, ఆ తర్వాత పల్నాడుకు వెళ్లారు పవన్‌ కల్యాణ్‌. అక్కడ సరస్వతి భూములను పరిశీలించి స్థానిక రైతులకు అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి హోదాలో భరోసా ఇచ్చారు. ఆ తర్వాత సరస్వతి భూములను ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా వరుసగా ఒక్కో అంశాన్ని తీసుకొని పవన్‌ కల్యాణ్‌ హల్‌ చల్‌ చేస్తూ సక్సెస్‌ అవుతున్నారని జనసేన పార్టీ వర్గాలు భేష్ అంటున్నాయి.

మరోవైపు.. సొంత పార్టీని బలోపేతం చేయడానికి వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మార్చి నెలలో పిఠాపురంలో జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్లీనరీ విజయవంతం చేయాలని ఇప్పటికే జనసేన వర్గాలకు మార్గదర్శనం చేశారు. ఆ ప్లీనరీ ముగిసిన తర్వాత తన పర్యటన కోసం రోడ్‌మ్యాప్ రూపొందించే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తమకు పట్టులేని ప్రాంతాల్లో అంటే ప్రధానంగా రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే తన పర్యటన ఎక్కువగా ఉండేలా ప్లాన్‌ చేసేందుకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారంటున్నారు. తిరిగి వైసీపీ ఆ ప్రాంతంలో బలోపేతం కాకుండా ముందుగానే అక్కడ జనసేనను పటిష్టం చేయాలన్నఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com