ఈ యేడాది శ్రీరామ నవమికి సీతమ్మను అలంకరించేందుకు బంగారు పట్టు చీర ముచ్చట పడుతోంది. భద్రాచలంలో సీతమ్మకు చేరాల్సిన ఆ చీర సిరిసిల్లలో సిద్ధమయ్యింది. ప్రతియేటా శ్రీరామ నవమి సందర్భంగా వినూత్న చీరలు నేస్తున్న సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ఈ యేడాది బంగారంతో చీర నేశాడు. సీతమ్మ కోసం ప్రత్యేకంగా పది రోజుల పాటు ఈ చీరను నేశాడు హరిప్రసాద్.
శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ తల్లికి బంగారు పట్టుచీరను నేసిన హరిప్రసాద్.. ఈ చీర కొంగులో భద్రాద్రి మూల విరాట్ దేవతలను తీర్చి దిద్దారు. అలాగే బార్డర్‌లో శంఖు చక్రాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా నేత నేశాడు. అత్యంత కళాత్మకంగా నేసిన ఈ చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 ఒక్కసార్లు ఉంది. ఈ చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించాడు. చీర బరువు ఎనిమిది వందల గ్రాములు కాగా ఇది ఏడు గజాల బంగారు చీర.
గతంలో ఇలాంటి అరుదైన ఎన్నో చీరలు నేసిన చేనేత కళాకారుడు హరిప్రసాద్‌కు సీతమ్మ వారి కోసం ఈ బంగారు చీర నేయడానికి పది రోజుల సమయం పట్టింది. ఈ అరుదైన చీరను సీతమ్మవారికి సమర్పించాలన్నది ఆయన ఆకాంక్ష, అభిలాష.
సిరిసిల్ల నేతన్నలకు అవకాశం ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి :
ప్రతి ఏటా భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని సిరిసిల్ల నేతన్నలకే ఇవ్వాలని హరిప్రసాద్ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. గత మూడేళ్లుగా సీతారాముల కళ్యాణానికి హరిప్రసాద్ ప్రత్యేకమైన చీరలు నేస్తున్నారు.