ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఆయన సోదరుడు, జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాగబాబు ప్రస్తుతం పిఠాపురంలోనే ఉన్నారు. శుక్రవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తరువాత, ఇవాళ మరికొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో, నాగబాబుకు టీడీపీ శ్రేణుల నుంచి ఊహించని ఆటంకం ఎదురవుతోంది. వర్మ అనుచరులు నాగబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
రెండో రోజున, నాగబాబు పిఠాపురం మండలంలోని కుమారపురంలో సి.సి రోడ్డును ప్రారంభించబోతున్న సమయంలో, టీడీపీ నేతలు ఆయనను అడ్డుకున్నారు. వర్మ వర్గానికి చెందిన కార్యకర్తలు “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంలో జనసేన కార్యకర్తలు తమ శక్తిని ప్రదర్శిస్తున్నట్లు కనిపించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.
అంతకుముందు, కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటన మొదలైనప్పటినుంచే ఉద్రిక్తతలు మొదలయ్యాయి. శుక్రవారం, నాగబాబు గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సమయంలో కొంతమంది టీడీపీ నేతలు వర్మకు అనుకూలంగా నినాదాలు చేసారు. దీంతో, నాగబాబు చుట్టూ ఉన్న జనసేన కార్యకర్తలు వాళ్లకు పోటీగా “జై పవన్ కల్యాణ్” అంటూ నినాదాలు చేశారు.
ఇక, నాగబాబు పిఠాపురం పర్యటనకు వర్మ దూరంగా ఉంటున్నారు. అయితే, కొంతకాలంగా వర్మలో అసంతృప్తి నెలకొందన్న సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి పిఠాపురంలో తన సీటును త్యాగం చేసిన వర్మ.. పవన్ కల్యాణ్‌కు పొత్తు ధర్మంలో భాగంగా సీటు అప్పగించారు. ఆయన గెలుపు కోసం కూడా ప్రచారం చేశారు. అయితే, పవన్ గెలుపునకు కచ్చితంగా ఎవ్వరూ కారణం కాదని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు నొక్కి వక్కాణించిన అంశం పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. వర్మ కూడా ఈ వ్యాఖ్యలపై కలత చెందినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే, నాగబాబు పర్యటన సమయంలో వర్మ అభిమానుల నుంచి నినాదాలు వినిపించాయి.
ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మకి టీడీపీ లేదా జనసేనలో సముచిత స్థానం దక్కడం లేదని ఆయనతో పాటు.. ఆయన అభిమానులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, వర్మ వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, వర్మ, ఆయన అనుచరులు ఈ ప్రచారాన్ని ఖండించటం లేదు.