బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారింది. అప్పటి ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుంచి పరారైంది. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం అధికారం చలాయిస్తోంది. అయితే ఈ ప్రభుత్వ మార్పు ఊరికే జరగలేదు. పోరాటాలు జరిగాయి.. అల్లర్లు జరిగాయి.. దాడులు జరిగాయి.. వందలాది మంది ప్రాణాలు పోయాయి. అయితే వీటన్నింటి మధ్య మరో విషయం కూడా జరిగింది. అదే ఆ దేశ జైళ్లో నుంచి అనేక మంది పరారవ్వడం. ఇందులో కరడుగట్టిన ఉగ్రవాదులున్నారు.. ఉరిశిక్ష పడిన హంతకులున్నారు.. ఇతర నేరస్థులు కూడా ఉన్నారు. ఇలా మొత్తం 700 మంది వరకు ఇప్పటికీ కూడా దొరకలేదు.
షేక్ హసీనాపై తిరుగుబాటు జరిగిన సమయంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా 2,200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహమ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు. వీరిలో దాదాపు 1500 మందిని మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించారు. కానీ ఇప్పటి కూడా 700 మంది ఖైదీల అడ్రస్ మాత్రం దొరకడం లేదు. వీరిలో 70 మంది వరకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నారు. జులై 19న బంగ్లాదేశ్ అల్లర్ల సందర్భంగా ఢాకా సమీపంలోని నార్సింగి జైలుపై వందల మంది దాడి చేసి నిప్పంటించారు. ఆ తర్వాత జైలులో ఉన్న వేలాది ఖైదీలను విడిపించారు. ఇదేదో బాగుందనుకున్నారేమో.. ఈ ఘటన జరిగిన తర్వాత వారాల్లో బంగ్లాదేశ్‌లోని మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. ఇందులో అత్యంత కరుడుగట్టిన నేరస్థులను ఉంచే కషిమ్‌పుర్ జైలు కూడా ఉండటం అప్పట్లో కాస్త టెన్షన్ పెట్టాయి.
రోజురోజుకు ఛాందసవాదం పెరిగిపోతున్న బంగ్లాదేశ్‌లో ఆ ఉగ్రవాదుల ఆచూకి నిజంగానే దొరకడం లేదా? లేక దొరికినా చూసి చూడనట్టు ఉంటున్నారా? అనేది మిస్టరీనే. ఎందుకంటే అలాంటి వారు బయటుండి తమ కార్యకలాపాలు నిర్వహిస్తేనే పొరుగు దేశాల్లో అశాంతిని పెంచే అవకాశం ఉంటుందని కూడా కొందరు ఆలోచించే అవకాశం లేకపోలేదు. అయితే పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీస్ శాఖ చెబుతోంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. జైళ్లో ఉన్న కొంత మంద కరడు గట్టిన ఉగ్రవాదులకు తాత్కాలిక యూనస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే బెయిల్ మంజూరైంది. మరి వారంతా ఇప్పుడేం చేస్తున్నారో.. ?