పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గాజా ప్రాంతం రక్తసిక్తమవుతోంది. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. నివాస భవనాలపై విరుచుకుపడిన ఈ దాడుల్లో 48 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 22 మంది చిన్నారులుండటం తీవ్ర విషాదానికి కారణమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్-అమెరికన్ బందీని విడుదల చేసిన కాసేపటికే ఈ దాడులు జరిగాయి.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని, శాంతి ఒప్పందాలపై ఆశలు పెట్టుకోవడం వద్దని ఆయన స్పష్టం చేశారు. హూతీ మిలిటెంట్లు ఇటీవల ఇజ్రాయెల్‌పై జరిపిన దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెతన్యాహు, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐడీఎఫ్ గతంలో చేసిన దాడులు గుర్తు పెట్టుకోవాలని, ఈసారి మరింత ఘాతుకంగా ఎదురుదాడులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తీరుతో గాజా ప్రజలపై ముప్పు మరింతగా పెరిగిందన్న భావన తారాస్థాయికి చేరింది.