తెలంగాణ రాజకీయాల్లో కీలక రాజకీయ పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితి తొలి రెండు టర్మ్‌లు రాష్ట్రాన్ని పాలించింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పదేళ్ల పాటు.. పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయనే సారథ్యం వహించారు. పార్టీ వ్యవస్థాపకుడైన కేసీఆర్.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఇప్పుడు పేరుకే కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నారని, పార్టీని నడిపిస్తున్నది అంతా కేటీఆరే అన్న చర్చ నడుస్తోంది. అధికారికంగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కొనసాగుతున్నారు. పార్టీని పూర్తిగా తన నియంత్రణలోనే నడిపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంగా పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతికి అందబోతున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ వైపు నుంచి అలాంటి సంకేతాలు మాత్రం రావడం లేదు.
కేటీఆర్‌ని అధ్యక్షుడిగా ప్రకటిస్తే.. హరీష్ రావు నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో హరీష్ రావు బహిరంగంగా క్లారిటీ ఇచ్చారు. పార్టీయే తనకు ముఖ్యమని, ఉద్యమ సమయంలో కేటీఆర్ కంటే ముందు నుంచే తాను పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యానని, ఒకవేళ.. నాయకత్వంగా కేటీఆర్ ఎదిగినా తనకు పార్టీ శ్రేయస్సే ముఖ్యమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఫాలో అవుతానన్నారు. కేటీఆర్ అధ్యక్షుడైనా తనకేమీ వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. దీంతో, కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అనే చర్చ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మరి.. కేసీఆర్.. తాను గౌరవాధ్యక్షుడి హోదాలో ఉండి.. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? చూడాలి.