ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇస్తున్నామని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరా గాంధీ కల్పించారని కొనియాడారు.
ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే సొంత ఇల్లు ఉండాలని, ఆ కల నెరవేరాలనే ఇందిరా గాంధీ ఇళ్లు నిర్మించి ఇచ్చారని సీఎం తెలిపారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదని చెప్పగలనని సీఎం అన్నారు. కూడు.. గూడు.. గుడ్డ… నినాదాన్ని ఇందిరా గాంధీ ఆచరణలోకి తీసుకువచ్చారన్నారు. సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజనులు, దళితులకు మిగులు భూముల పంపిణీ చేపట్టారని, ఇళ్ల నిర్మాణం చేపట్టారని సీఎం తెలిపారు. ఇందిరమ్మ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.10 వేలు కేటాయిస్తే.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది రూ.1.25 లక్షలకు చేరిందని… పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు తమ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా.. గ్రీన్‌ఛానల్ ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షలు అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తొలి ఏడాది సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తామని, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, దళితులు, గిరిజనులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గిరిజనులకు ఇళ్లు కేటాయించారని, ఆ తర్వాత వారికి ఇళ్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలోని నియోజకవర్గాలు, ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా ఇస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నల్లమల్లలోని చెంచులు… ఆదిలాబాద్‌లోని గోండులు… భద్రాచలంలోని కోయలు.. ఎవరైతే తెలంగాణ మట్టి మనుషులో.. తెలంగాణ మూల పురుషులో వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవెల్లికి వెళ్లి తాను స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పట్టాలు అందజేసిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఈ నమూనానే పాటించాలని తాము సూచించడం లేదని, అదే సమయంలో తమకున్న స్థలంలో ప్రతి అంగుళాన్ని లబ్ధిదారులు వినియోగించుకునేలా ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్‌లు నిర్మిస్తామని.. లబ్ధిదారులు తమ అవగాహన కోసం వాటిని చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. లబ్ధిదారులు తమ స్థోమతకు తగ్గట్లు అదనపు గదులు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు…
కాంగ్రెస్ ప్రభుత్వానివి 25 లక్షల ఇళ్లు.. బీఆర్ఎస్‌కు 65 వేల ఇళ్లు…
2004 నుంచి 2014 వరకు పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 25.04 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను పిట్ట గూళ్లని.. కొడుకు, కోడలు, అల్లుడు, బిడ్డ వస్తే ఎక్కడ ఉంటారని ఎన్నికల ప్రచార సభల్లో విమర్శలు గుప్పించిన కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో కేవలం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించి 65 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని సీఎం విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 35 వేల ఇళ్ల పూర్తికి తాము రూ.195 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదని… కానీ ఆరు నెలల్లో ఆయన కోసం కోట లాంటి ప్రగతి భవన్‌ను, వాస్తు కోసం సచివాలయాన్నినిర్మించుకున్నారని, గజ్వేల్, జన్వాడల్లో ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భవనాల కోసం ఎకరాల కొద్ది భూమి కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తన పదవీ కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని, ఆయన చెప్పినట్లు కోడి, మేక ఎక్కడ ఉండాలో చూపలేదని.. కానీ కాలనీకో బెల్టు షాపు పెట్టారని సీఎం విమర్శించారు. లక్ష్యం ఎంత గొప్పదైనా అమల్లో లోపాలు ఉంటే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని, పేదవాళ్లకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సైతం వినియోగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పునాది స్థాయి నుంచి స్లాబు స్థాయి వరకు ప్రతి దశలోనూ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించడమే కాకుండా శాఖకు పూర్తి స్థాయి సిబ్బందిని ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.