ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ టర్మ్‌లో రిలాక్స్ మూడ్‌లో కనిపిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచీ చంద్రబాబు వ్యవహారశైలిలో స్పష్టంగా మార్పు కనిపిస్తోందంటున్నారు. మొత్తానికి రొటీన్‌కు భిన్నంగా చంద్రబాబు తీరు ఉంటోందన్న చర్చ జోరుగా సాగుతోంది.
నారా చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి రాక ముందు ఒకలా ఉంటారు. వచ్చిన తర్వాత మరొకలా వ్యవహరించేవారు. అయితే, ఈసారి మాత్రం సరికొత్త మార్పు కనిపిస్తోందంటున్నారు. గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కనిపించని మార్పు చంద్రబాబులో ఇప్పుడు గమనిస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినన్నాళ్లు.. చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఒక దశలో తనకు తానే రాష్ట్రానికి సీఈవోగా ప్రకటించుకున్నారు. ఉంటే సీఎం ఆఫీసులో.. లేకుంటే జిల్లాల పర్యటనల్లో.. కాకపోతే పార్టీ కార్యాలయంలో.. ఇలా గడిచేది చంద్రబాబు దినచర్య. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014 నుంచి 2019 వరకూ దాదాపు అదే పంథాను కొనసాగించారు.
కానీ, ఈసారి మాత్రం ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రిలాక్స్ మూడ్ స్పష్టంగా గోచరిస్తోంది. అంటే గతంలో మాదిరిగా అధికారులపై హడావిడి చేయడం లేదు. ఆకస్మిక తనిఖీలు లేవు. తనను 1995 నాటి ముఖ్యమంత్రిగా చూస్తారని చంద్రబాబు ఆ మధ్య చెప్పినప్పటికీ.. ఆ విధమైన పోకడలు ఆయనలో కనిపించడం లేదు. ఎంత కష్టపడినా ఇంతేలే అనుకున్నారో? మరో కారణమో తెలియదు గానీ నాటి చంద్రబాబులో ఉన్న ఫైర్ కనిపించడం లేదన్నది ఆయనను దగ్గర నుంచి గమనిస్తున్న నేతలు చెబుతున్నారు.
గతంలో సీఎంగా ఉన్న సమయంలో సెక్రటేరియట్‌లో రాత్రి ఎనిమిదన్నర గంటల వరకూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేవారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చేవారు. అక్కడ నేతలతో దాదాపు రాత్రి పది గంటల వరకూ చర్చించే వారు. కానీ, ఇప్పుడు నేతలతో చర్చించడం పూర్తిగా మానేశారంటున్నారు. ఏదైనా ఎన్నికలుంటే తప్ప ఆయా జిల్లా నేతలతో గానీ, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో గానీ సమావేశం కావడం లేదు. ఇక, ప్రతి శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలనుకున్నా అన్ని సార్లూ అది సాధ్యం కావడం లేదు. కానీ, వీలున్నప్పుడల్లా శనివారం మాత్రం పార్టీ ఆఫీసుకు వెళ్లి కార్యకర్తల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు.. ఆదివారం అయితే ఆయన చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నారు. వీలయితే శని, ఆదివారాలు హైదరాబాద్ వెళ్లిపోతారు. మంత్రులకు కూడా ఆదివారాలు ఫ్యామిలీలతో గడపాలని చంద్రబాబు చెప్పడం చూసి ఆయనలో వచ్చిన మార్పుకు సీనియర్ నేతలు విస్తుపోతున్నారు. ఒకనాడు తాను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వననే చంద్రబాబు నినాదం ఫేమస్ అయ్యింది. కానీ, 2024 ఎన్నికల తర్వాత మాత్రం ఉదయం పదకొండు లేదా పన్నెండు గంటలకు సచివాలయానికి వస్తున్నారు. తిరిగి ఆరు గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటున్నారు. లోకేష్ రాజకీయంగా చేతికి అందిరావడంతో పార్టీ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. జిల్లాలో నేతల మధ్య విభేదాలను కూడా లోకేష్ పరిష్కరిస్తుండటంతో చంద్రబాబుకు పెద్దగా రాజకీయంగా పని లేకుండా పోయిందంటున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే ఆయన పరిమితమవుతూ తన ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద 1995 నాటి చంద్రబాబుకు 2025 నాటి చంద్రబాబుకు మధ్య ముప్ఫయి ఏళ్ల తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నది పార్టీవర్గాల మాట.