తెలంగాణలోని వరంగల్ జిల్లాలో నక్సలిజం చరిత్రలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి, సామాజిక స్రవంతిలో కలిసే ఆలోచనతో 14 మంది మావోయిస్టులు గురువారం అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వీరిని వరంగల్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. లొంగిపోయిన ప్రతీ మావోయిస్టుకు ప్రభుత్వం తరఫున రూ. 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హింసా మార్గాన్ని వీడి, కుటుంబాలతో కలిసి సమాజంలో ప్రశాంత జీవితం గడపాలన్నదే తమ ఆశయమని, నక్సలిజాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే, ప్రభుత్వ సహాయంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐజీ తెలిపారు.
లొంగిపోయిన 14 మంది మావోయిస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏవో బిఎస్‌జెడ్‌సి, డివిజన్ గాలికొండ ఏరియా కమిటీ సభ్యుడు మడవి అంద రాజేష్, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, ఉదయ్ ప్రొటెక్షన్ టీం ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి, డివిజన్ కమిటీ సభ్యులు మరకం హిడుమే, మడకం జోగి, కోవాసి జోగి, పోడియం భూమిక, సోడి కోసి వెన్నెల, సోడి బుద్రి బద్రి, మడవి పూజే, హేమ్లా సోను, సోడి రమేష్, భీమా మిలిషియా సభ్యులు అట్టం బుద్ర, కోవాసి ఇడుమ, కోర్సా లాలు, హేమ్లా సుక్కు అర్జున్, కోర్సా సుక్కు ఉన్నారని ఐజీ చంద్రశేఖర్ తెలిపారు.
ఇప్పుడు లొంగిపోయిన ఈ మావోయిస్టులు గతంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అనేక విధ్వంసకర ఘటనల్లో, పోలీసులపై దాడుల్లో పాల్గొన్నట్లు చెప్పారు. అలాగే, ఇన్ఫార్మర్లపై అనుమానంతో హత్యలు చేసిన ఘటనల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్టు వివరించారు.