ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపైనా, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వివాదంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రాజకీయాల్లో దానం నాగేందర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న బహిరంగ సభ సక్సెస్ అవుతుందని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని, సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ చేసిన రీట్వీట్‌లోనూ తప్పేం లేదన్నారు దానం నాగేందర్. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని అన్నారు. అంతేగాని ఆమె చేసిన పనిలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమీ లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించి 25 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధినాయకత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇక ఈ సభపై అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో… కేసీఆర్ ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దానం నాగేందర్ కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం సంచలనం రేపింది.
ఇక, స్మితా సభర్వాల్ ట్వీట్ వ్యవహారంపైనా దానం మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌పై ఓవైపు.. కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్న సమయంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆమెకు మద్దతుగా మాట్లాడటం చర్చను లేవనెత్తింది. స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌లో తప్పేమీ లేదన్నారు.
హైదరాబాద్‌లోని నారాయణగూడ కమ్యూనిటీ హాలులో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్మితకు ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని, కోర్టు చివాట్లతో చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు.