ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. హమాస్ 33 మందిని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఇందులో ముగ్గురిని ఇజ్రాయెల్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఆ ముగ్గురు వారి కుటుంబాలను కలుసుకున్నారు. ఇక ఇజ్రాయెల్ జైళ్లల్లో ఉన్న 90 మంది పాలస్తీనా ప్రజలను కూడా రిలీజ్ చేసింది. మొత్తం 2 వేల మంది వరకు రిలీజ్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
బందీల విడుదల ముందు కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. హమాస్ చెప్పినట్టుగా బందీల పేరుతో లిస్ట్ రిలీజ్ చేయకపోవడంతో ఇజ్రాయెల్ కాల్పులకు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో హమాస్ ముగ్గురు పేర్లతో లిస్ట్‌ను రిలీజ్ చేసింది. దీంతో మూడు గంటలు ఆలస్యంగా ఒప్పందం అమల్లోకి వచ్చింది.
హమాస్ రిలీజ్ చేసిన బందీలు రోమి గోనెన్ (24), ఎమిలి దమారి (28), డొరోన్ స్టెయిన్‌బ్రెచర్ (31). వారిని రెడ్ క్రాస్‌కు అప్పగించగా.. వారు ఇజ్రాయెల్ ఆర్మీకి అప్పగించారు. వారిని ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చారు. ఇక పాలస్తీనా ప్రజలను తీసుకెళ్లేందుకు రెడ్ క్రాస్ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది.
హమాస్ ఇంకా 30 మందిని రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ ఒప్పందంలో మొదటి దశ 42 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో హమాస్ 33 మందిని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ముగ్గురిని విడుదల చేయడంతో మిగతా వారి విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. వీరిని ఎప్పుడు, ఎలా రిలీజ్ చేస్తారనేది చూడాలి. బందీలను ఎంత త్వరగా రిలీజ్ చేస్తారనే దానిపైనే ఇప్పుడీ ఒప్పందం కొనసాగడంపై క్లారిటీ ఉంటుంది.