తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ సోమవారం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొలికపూడి సోమవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యారు. ఎస్టీ మహిళపై దాడి చేసిన వ్యవహారంలో తిరువూరు శాసనసభ్యడు కొలికపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఈ సంఘటనే కాకుండా నియోజకవర్గంలో అనేక వివాదాలకు ఎమ్మెల్యేనే కేంద్రబిందువు అవుంతుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. సామాజికవర్గాల మధ్య అంతరాలు పెంచేలా ఎమ్మెల్యే కొలికపూడి ప్రవర్తన ఉండటంతో గతంలో ఒకసారి క్రమశిక్షణా సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఆ తరువాత కూడా ఎమ్మెల్యే కొలికపూడి ప్రవర్తనలో మార్పు లేకపోవడం ఏకంగా ఎస్టీ మహిళపైనా ఆమె కుటుంబంపైనా స్వయంగా కొలికపూడే దాడి చేశారనే అభియోగాలు రావడంతో ఈ ఆరోపణలను టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే క్రమశిక్షణా సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వమని రెండోసారి కొలికపూడిని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యారు కొలికపూడి. మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఎంషరీఫ్, ఎమ్మల్సీ పంచుమర్తి అనురాధ, మంత్రి బీసీ.జనార్ధన్‌రెడ్డి, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలు సభ్యులుగా ఉన్న క్రమశిక్షణా సంఘం ముందు హజరై తన వివరణను ఇచ్చారు కొలికపూడి. ఎమ్మల్యే వివరణను నివేదిక రూపంలో పార్టీ అధ్యక్షుడికి క్రమశిక్షణ సంఘం సమర్పించనుంది. అయితే కొలికపూడి వైఖరిపై పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి వచ్చిన తరువాత కొలికపూడి శ్రీనివాస్‌ని పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
- Advertisement with us -