తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలోని ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం ఇప్పుడు కేటీఆర్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కేసులో ఏ-1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను చేర్చింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. తాజాగా ఏసీబీ అధికారులు విచారణకు రావాలంటూ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ఆయనతో పాటు.. ఈ కేసులో ఏ-2గా ఉన్న బీఎల్‌ఎన్‌రెడ్డి, ఏ-3గా ఉన్న అరవిందల్‌కుమార్‌లకు కూడా ఏసీబీనోటీసులు ఇచ్చింది. వాళ్లు కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బీఎల్‌ఎన్‌రెడ్డి 8వ తేదీన, అరవింద్‌కుమార్ 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
మరోవైపు.. ఈ కేసులో ఆలస్యంగా ఎంటర్ అయినా ఏసీబీ కంటే ఎక్కువ గూకుడు ప్రదర్శిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఏసీబీ నుంచి సేకరించిన ఆధారాల మేరకు కేసు నమోదు చేసిన ఈడీ.. ఆ వెంటనే ముగ్గురు నిందితులకూ నోటీసులు జారీచేసింది. ముగ్గురికీ వేర్వేరుగా నోటీసులు జారీచేసింది. బీఎల్‌ఎన్‌రెడ్డిని ఈనెల 2వ తేదీన, అరవింద్‌కుమార్‌ను ఈనెల 3వ తేదీన, అలాగే, కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులిచ్చింది. అయితే, బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్ తాము విచారణకు హాజరు కాలేమంటూ ఈడీకి సమాచారమిచ్చారు. దీంతో, ఈడీ వాళ్లను ప్రశ్నించే తేదీలు మార్చింది. తిరిఇ ఈనెల 8, 9 తేదీల్లో విచారణకు హాజరు కావాలంటూ కొత్తగా నోటీసులు జారీచేసింది. అంటే కేటీఆర్‌ను విచారించిన తర్వాత వాళ్లిద్దరినీ ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారంటూ మొదట ఏసీబీ కేసు పెట్టింది. అయితే, ఆర్‌బీఐ అనుమతి లేకుండా డబ్బులు విదేశీ కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయడం.. మనీలాండరింగ్ వ్యవహారమేనంటూ ఈడీ కూడా కే సు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, మనీలాండరింగ్ యాక్ట్ – పీఎమ్‌ఎల్‌ఏ కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచి బ్రిటన్‌లోని బ్యాంకు అకౌంట్‌కు ఎలాంటి పన్నులు చెల్లించకుండానే, ప్రభుత్వం అనుమతి లేకుండానే రూ.45.71 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఇన్‌కం ట్యాక్స్ ఆడిట్‌లో వెలుగులోకి వచ్చింది. దీంతో హెచ్‌ఎండీఏ బోర్డుకు ఐటీ మొదట నోటీసులు ఇచ్చింది. హెచ్‌ఎండీఏ నిధుల నుంచే రూ. 8 కోట్ల 6 లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు ఇన్‌స్క్రిప్షన్- ఇంటర్‌స్టేట్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు మరో రూ. 1,10,51,014 హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఇలా మొత్తంగా రూ. 54,88,87,043 హెచ్‌ఎండీఏ నిధుల నుంచి చెల్లింపులు జరిగినట్టుగా ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం నిధులు వెచ్చించడానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందలేదని కూడా గుర్తించింది.