29.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

పార్లమెంటులో గురజాడను గుర్తు చేసిన నిర్మలా సీతారామన్‌

ఆంధ్రా కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలుగు రచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును దేశ పార్లమెంటులో స్మరించుకున్నారు. ఈ యేడాది కోసం పార్లమెంటులో దేశ బడ్జెట్‌ను శనివారం ఆమె ప్రవేశపెట్టిన సందర్భంగా గురజాడ అప్పారావు కవితను ప్రస్తావించారు. ఆయన కవితా పంక్తులతోనే బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌…’ అంటూ తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిదో బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వరుసగా అత్యధిక బడ్జెట్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖామంత్రిగా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన నిర్మల.. తన రికార్డును తానే అధిగమించారు.

దేశంలో నరేంద్రమోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని నిర్మల తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. తాము చేపట్టిన సంస్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశా సరసన భారత్ ఒకటిగా చేరిందన్నారు. జీరో పర్సెంటేజ్‌ పేదరికమే లక్ష్యంగా తాను బడ్జెట్ పెడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో ఈ యేడాది బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టారు. ఇన్ ఫ్రా, మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారామె.

బడ్జెట్‌ ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మన ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో తమ వృద్ధి ట్రాక్ రికార్డ్, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టిని ఆకర్షించాయని చెప్పారు. ఈ పదేళ్ల కాలంలో భారతదేశం సామర్థ్యంపై ప్రపంచ స్థాయిలో విశ్వాసం పెరిగిందన్నారు. అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి, సమ్మిళిత వృద్ధిని సాధించడానికి వచ్చే ఐదేళ్లను ఒక ప్రత్యేక అవకాశంగా తాము భావిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

మరోవైపు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగాన్ని లోక్‌సభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. అయితే సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com