ములుగు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 9వ తేదీ సోమవారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ పేర్కొంది. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ మేరకు విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఈనెల 1వ తేదీన ములుగు జిల్లా పోకలమ్మ వాగు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అయితే, ముందుగా విషం కలిపిన ఆహార పదార్థాలు పంపించి ద్రోహం చేసి ఎన్‌కౌంటర్ పేరిట మావోయిస్టులను చంపేశారని జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు. అన్ని వ్యాపార సంస్థలు, విద్యాలయాలు బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించాఉ. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.