నార్త్ కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సౌత్ కొరియాలో అడుగు పెట్టిన సమయంలోనే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాలపై సౌత్ కొరియా గుర్తించింది.. జపాన్ కూడా ధ్రువీకరించింది. అయితే ఈ ప్రయోగాలపై లెటెస్ట్‌గా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్పందించారు. తాము ప్రయోగించింది బాలిస్టిక్ మిసైల్స్ కాదు.. హైపర్ సోనిక్ మిసైల్స్‌ను టెస్ట్ చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఉత్తర కొరియా భద్రత, పసిఫిక్ రీజియన్‌లో తమ శత్రువులను కంట్రోల్ చేయడానికి ఈ ప్రయోగం చాలా కీలకమైనదన్నారు కిమ్.
నిజంగా ఈ మిసైల్స్ అంత శక్తివంతమైనవా?
హైపర్ సోనిక్ మిసైల్స్ శబ్ధం కంటే వేగంగా ప్రయాణించి.. శత్రు దేశాలు తిరిగి దాడి చేసే లోపే విధ్వంసం సృష్టిస్తాయి. ఇప్పుడు నార్త్ కొరియా ప్రయోగించిన హైపర్ సోనిక్ మిసైల్ 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అది కూడా శబ్ధం కంటే 12 రేట్ల వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రయోగాన్ని మరింత అభివృద్ధి చేస్తే దక్షిణ కొరియాతో పాటు.. జపాన్, అమెరికాకు కూడా టెన్షన్ తప్పదనే చెప్పాలి. గతేడాది నవంబర్‌లో సాలిడ్ ఫ్యూయల్ ICBMను ప్రయోగించింది నార్త్ కొరియా.
ఆత్మ రక్షణ కోసమే: కిమ్
తమ ప్రయోగాలన్ని ఆత్మ రక్షణ కోసమే అంటున్నారు నార్త్ కొరియా అధినేత కిమ్. తాము ఎవరిని బెదిరించడానికో.. దాడులు చేయడానికో ఈ ప్రయోగాలు చేయడం లేదన్నారు. తమపై ఏదైనా దాడి జరిగితే వీటిని ప్రయోగిస్తామని.. వీటిని అడ్డుకునే వ్యవస్థలు లేవన్నారు. అంతేకాదు భవిష్యత్తులో కూడా తమ మిలటరీని డెవలప్ చేస్తూనే ఉంటామన్నారు.
బ్లింకెన్ పర్యటనకు ప్రయోగానికి లింక్ ఉందా?
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రస్తుతం సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. సరిగ్గా ఆయన అడుగు పెట్టగానే ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. అంటే ఆయనను పర్యటనను వ్యతిరేకిస్తోందని చెప్పకనే చెబుతున్నారు కిమ్. ఇప్పుడే కాదు అమెరికా, సౌత్ కొరియా యుద్ధ విన్యాసాలు చేపట్టిన ప్రతిసారీ నార్త్ కొరియా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. ఉత్తర కొరియా చేపట్టిన ఈ ప్రయోగాన్ని అమెరికా, దక్షిణ కొరియా ఖండించాయి. అమెరికా, సౌత్ కొరియా, జపాన్ మరింతగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బ్లింకెన్ తెలిపారు. ఇదే సమయంలో నార్త్ కొరియా, రష్యా కలిసి స్పేస్ టెక్నాలజీపై కలిసి పనిచేస్తున్నాయని పనిలోపనిగా ఆరోపించారు.