- తెలుగుదేశంలో ముసలం?
- రేపటి నేత లోకేష్ పై చర్చ
- ఏపీలో రాజకీయ కలకలం
- వీకెండ్ కామెంట్ పై రచ్చ రచ్చ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి వయసు 2029 నాటికి 80 ఏళ్లకు చేరుతుంది. ఆ తర్వాత తెలుగుదేశంలో మారనున్న రాజకీయ సమీకరణాలపై ఏబీఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్స్ లో రాసి బహిరంగ చర్చకు పెట్టారు. అదిప్పుడు నెట్టింట సంచలనమై కూర్చుంది. చంద్రబాబుకి ఎంతో వీరవిధేయునిగా పేరున్నఆర్కే, ఇలాంటి సంచలన కథనానికి ఎందుకు తెరలేపారని, అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో ఎన్నో అంతర్గత సందేహాలు మిళితమై ఉన్నాయి.
చాలామంది అనేమాట ఏమిటంటే… ఈ కథనాన్ని చంద్రబాబే దగ్గరుండి ఆర్కే చేత రాయించారని అంటున్నారు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం చంద్రబాబుకి అలవాటు. అదాయన రాజగురువు నేర్పిన తారక మంత్రం. ఇప్పుడదే అస్త్రాన్ని జనాలపైకి వదిలారని అంటున్నారు. అయితే దీనిపై కూడా పలు అభిప్రాయభేదాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు తర్వాత వారసుడిగా ప్రజలు ఎవరిని అనుకుంటున్నారు? మేధావులు ఏమనుకుంటున్నారు? లోకేష్ పై జనాల్లో అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకుందామని కావాలనే రాయించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో విజనరీ ఉన్న చంద్రబాబుకి తనకు వయసు మీరిపోతుందనే విషయం తెలియకుండా ఉంటుందా? అని కూడా అంటున్నారు.
అయితే, ఇప్పుడు ప్రజలు, మేధావులు, విభిన్న వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి, ఆయన నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నారు. తను ఉండగానే సీఎం సీట్లో లోకేష్ ని కూర్చోబెట్టి, వెనుక ఉండి, షాడో సీఎంగా చేయడానికి ఉపక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. దీనివల్ల లాభాలు ఏమిటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అదే పోస్టులో శాశ్వతంగా ఉంచవచ్చు. ఇది తన అభిప్రాయంగా క్యాడర్ కి, ప్రజలకి ఒక సందేశాన్ని పంపించవచ్చు, తద్వారా నాయకులు, మంత్రులకు ఒక క్లారిటీని ఇవ్వవచ్చుననే.. భావనతోనే పక్కా ప్లాన్డ్ స్టోరీ వచ్చిందని కొందరు అంటున్నారు.
రూపాయి నాణానికి రెండోవైపున్నట్టే… ఇక్కడ కూడా చంద్రబాబుకి తెలియని మరో కోణాన్ని ఆర్కే బయటపెట్టాడా? అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆ కథనంలో ఒక ప్రశ్న ఉంది. అదేమిటంటే.. చంద్రబాబు మర్రిచెట్టులాంటి వాడు, ఆ నీడలో చిన్నమొక్క కూడా ఎదగదు. అలాంటిది కొడుకు లోకేష్…ఎలా పైకి వస్తాడన్నది ప్రశ్న. అంటే ఈ తరహా వార్త రాసి, చంద్రబాబుకి ఒక సందేశం అందించి ఉండవచ్చు కదా…అని అంటున్నారు.
లేదంటే పార్టీలో చంద్రబాబు తర్వాత ఎవరు? అనే అంతర్గత చర్చ జరుగుతోందా? అదేమైనా ముసలంగా మారుతుందని భావించి రాశారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. లేకపోతే ఎవరైనా కావాలని రాయించారా? అని పలువురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీలో లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేనివారు, ఆయన ఒంటెత్తు పోకడలు నచ్చనివారు ఎందరో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే చంద్రబాబు పొలిటికల్ స్టయిల్ వేరు, లోకేష్ తరహా వేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి లోకేష్ నాయకత్వాన్ని ఇష్టపడని వారు జనసేన, బీజేపీ చెంతకు చేరే అవకాశాలున్నాయని ఆర్కే చెప్పకనే చెప్పారా? అని కూడా భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకోకపోతే, ఏదైనా అనర్థం జరిగితే, సరిదిద్దుకోని పొరపాటుగా మారుతుందని భావించి..ఆర్కే గీత దాటి రాశారా? అని కూడా అంటున్నారు.
తెలుగుదేశం ఎప్పుడు జంప్ జిలానీ పార్టీయే కాబట్టి, ఎన్టీఆర్ నుంచి ఒకప్పుడు నాదెండ్ల భాస్కరావు లాగారు. తర్వాత మళ్లీ ఎన్టీఆర్ గెలిచారు. ఈసారి ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు వైపు వచ్చారు. రేపు అలా పవన్ కళ్యాణ్ వైపు వెళ్లరని గ్యారంటీ ఏమిటి? అని ఆర్కే చెప్పకనే చెప్పారని అంటున్నారు. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి వేళ్లూనుకుంటున్నాడా? అనే భావనలు ఆర్కే కథనంలో వ్యక్తమయ్యాయి. ఈ కథనం నిజమవని, కాకపోనీ, చంద్రబాబు మాత్రం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది.