– ఇన్‌కమ్ టాక్స్ వ్యవస్థ క్లిష్టంగా ఉండడంతో ఇబ్బందులు
– వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలి
– రాష్ట్రాల అభివృద్ధికి రుణస్వేచ్ఛ, ఆర్థిక స్వయం ప్రతిపత్తికి అనుమతులు
– ఉపాధి హామీ నిధుల వినియోగంలో సౌలభ్యం అవసరం
– కేంద్ర ప్రి-బడ్జెట్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. రాజస్తాన్‌లోని జై సల్మేర్‌లో శుక్రవారం జరిగిన కేంద్ర ప్రీ-బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖా మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుఅంశాలను భట్టి విక్రమార్క కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇన్‌కమ్ టాక్స్ వ్యవస్థ క్లిష్టంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే, రాష్ట్రాల అభివృద్ధికి రుణస్వేచ్ఛ, ఆర్థిక స్వయం ప్రతిపత్తికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఉపాధి హామీ నిధుల వినియోగంలో రాష్ట్రాలకు మరింత సౌలభ్యం అవసరమని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.
కీలకమైన కేంద్ర ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చర్చలు సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని, అలాగే, రాష్ట్రాల ప్రాధాన్యతలను జాతీయ దృష్టితో చూసే అవకాశాన్ని కల్పిస్తాయని భట్టి అభిప్రాయపడ్డారు. 2021లో ప్రారంభించిన ఆర్థిక సమీకరణ ప్రణాళిక మనకు మంచి ఫలితాలు అందించిందని, అయితే, 2026 ఆర్థిక సంవత్సరానికి చేరుకుంటున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణను వృద్ధి అవసరాలతో సమతుల్యం చేయడం కీలకమన్నారు. మూలధన వ్యయం, ఉపాధి సృష్టి పెంపు కోసం జీడీపీకి 4.5% ఆర్థిక లోటు గడువు అనుకూలమని తెలంగాణ అభిప్రాయపడుతోందన్నారు. ప్రస్తుతం కేంద్రం తెచ్చిన ఆదాయ పన్ను చట్టం సంస్కరణలు స్వాగతయోగ్యమైనవన్న ఉప ముఖ్యమంత్రి.. ప్రస్తుత పన్ను వ్యవస్థ క్లిష్టంగా ఉండటం వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పన్ను స్లాబుల సరళీకరణ, కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు అవసరమన్నారు. ఆదాయపు పన్ను, GST ఫైలింగ్ ప్రక్రియలను సరళీకరించడం చాలా ముఖ్యమని తెలంగాణ అభిప్రాయపడుతోందన్నారు. ప్రపంచ అనిశ్చితులు, దేశీయ ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో, మూలధన వ్యయ ప్రోత్సాహం అవసరమన్నారు. రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక సహాయంగా సంవత్సరానికి ₹2.5 లక్షల కోట్లు కేటాయించాలని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఎంఎస్‌ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలమని, అయితే, వాటి ఎదుగుదల కోసం తగిన విధానాలు అవసరమన్నారు. ఐటీఐలను ఆధునీకరించాలని, ఏఐ, పునరుత్పాదక శక్తి,, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో యువతకు నైపుణ్యం కల్పించేందుకు తగిన నిధులు కావాలని కోరారు. గిగ్ కార్మికులకు సరైన భద్రత అందించడానికి జాతీయ విధానాన్ని రూపొందించాలని సూచించారు.
ఇక, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అవసరమైన ప్రత్యేక ప్రాధాన్యతలను కూడా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. సీఎస్‌ఎస్ కింద తెలంగాణకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పెండింగ్ బకాయిల చెల్లింపు ఇంకా అలాగే ఉందని, సంవత్సరానికి ₹450 కోట్ల మంజూరు మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని కోరారు. తెలంగాణ వెనుకబడి ఉన్న జిల్లాలకు పర్యావరణ అనుకూలమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి నిధులు అందించాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ఉపాధి సమస్యలను పరిష్కరించడానికి నిధుల వినియోగంలో మరింత సౌలభ్యం అవసరమన్నారు. MSMEలకు పీఎల్‌ఐ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ కోరుతోందన్నారు. రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి రుణాల కోసం తగిన అనుమతులు ఇవ్వాలన్నారు. భారత దేశానికి తెలంగాణ వృద్ధి ఇంజిన్‌గా నిలవడానికి గట్టి సంకల్పంతో ఉందని భట్టి విక్రమార్క కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.