ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సంక్రాంతి పండుగ లోపే అర్హుల జాబితా ప్రకటిస్తారని అంటున్నారు. సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌కార్డులు పంపిణీచేయాలన్న ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉందంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ యేడాది జనవరి ప్రారంభం నుంచి చాలా మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా.. మార్పులు, చేర్పులు చేయాల్సినవారు కూడా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వచ్చిన దరఖాస్తులతో పాటు.. కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించనున్నట్లు సమాచారం.