తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ నుంచి ప్రకటించి అందజేసిన వందకోట్ల రూపాయల ఫండ్‌ను తిరిగి పంపిస్తున్నట్లు ఆ వందకోట్ల ఫండ్‌ను ఉపసంహరించుకోవాలని అదాని ఫౌండేషన్ చైర్మన్ ప్రీతి అదానీకి ప్రభుత్వం లేఖ రాసింది. అదానీ కంపెనీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ ఫండ్ తీసుకోవటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాలుగైదు రోజులుగా అదానీ వ్యవహారంపై తీవ్ర చర్చ జరగుతోందని.. అదానీ నుంచి రూ. 100 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ. 100 కోట్లు ఇస్తానని లేఖ రాసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఆ డబ్బులు తీసుకోవటానికి సిద్ధంగా లేమని చెప్పారు. ఈ మేరకు అదానీ గ్రూప్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు.
అదానీ వ్యవహారానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదని మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అదానీ నుంచి రూ.100 కోట్లు నిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, చాలా సందర్భాల్లో దీనిపై వివరణ ఇచ్చినా.. కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టబద్దంగా, రాజ్యాంగబద్ధంగా టెండర్లు పిలిస్తే.. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని మా నేత రాహుల్ చెప్పారని, నిబంధనల మేరకు టెండర్లు నిర్వహిస్తామని, ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చాలా మంది నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు రేవంత్. కార్పోరెట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ సంస్థ కూడా రూ.100 కోట్లు ఇస్తామని లేఖ ఇచ్చారని చెప్పారు. అదానీ గ్రూప్ 100 కోట్లు తమకేమీ అప్పనంగా ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బ తీయకూడదుని, అందుకే అదానీ ఇస్తానన్న రూ.100 కోట్లు తీసుకోవటానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు. ఇప్పటికే అదానీ గ్రూప్‌కు ఈ మేరకు లేఖ రాశామన్నారు సీఎం. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని రేవంత్ తేల్చి చెప్పారు.