25.2 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

సెలబ్రిటీలకు బౌన్సర్ల తలనొప్పులు

– సర్కారు వార్నింగ్‌తో ‘కక్కలేని.. మింగలేని’ పరిస్థితులు

బౌన్సర్లు.. చూపులతోనే ఎదుటివాళ్లకు భయం పుట్టించేలా ఉంటాయి వీళ్ల హావభావాలు. ప్రముఖులకు సెక్యూరిటీ పేరుతో వీళ్లు చేసే అరాచకాలకు అడ్డూ అదుపూ ఉండదు. సామాన్య జనాలే కాదు.. వీళ్లముందు ఎవరైనా బలాదూరే.. ఎవరినీ లెక్కచేయరు. చివరకు శాంతిభద్రతలు రక్షించే పోలీసులను కూడా ఖాతరు చేయరు. అలాంటి సందర్భాల్లో కిందిస్థాయి పోలీసులు కూడా ఒక్కోసారి బాధితులవుతూ ఉంటారు. ఉన్నతాధికారులకు బౌన్సర్ల ఆగడాలపై కాంప్లెయింట్ చేద్దామన్నా.. వాళ్ల వెనుక ఎవరో ఓసెలబ్రిటీ ఉంటారు. వాళ్లతో పెట్టుకోవడం ఎందుకులే.. అంటూ పై అధికారులు కూడా సర్దిచెప్పే పరిస్థితులు ఉంటాయి. దీంతో, తమకు ఎదురే లేదని విర్రవీగుతూ ఉంటారు బౌన్సర్లు. అయితే, వీళ్ల కోరలు పీకేసే సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సెలబ్రిటీలు వస్తున్నారంటే చాలు.. వాళ్లకంటే.. ప్రభుత్వ అధికారులకంటే బౌన్సర్ల హడావిడే ఎక్కువగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు పుష్ప-2 సినిమా తొక్కిసలాట తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బౌన్సర్ల కోరలు పీకేసేలా ఉంది. టాలీవుడ్‌ పెద్దలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆదేశాలను కిమ్మనకుండా అమలు చేస్తామంటూ తలూపేశారు.

మొన్నటికి మొన్న సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట వ్యవహారం ఏ స్థాయిలో ఉద్రిక్తతలకు దారితీసిందో అందరికీ తెలిసిందే. దానికి బౌన్సర్ల అత్యుత్సాహమే కారణమని తేలింది. అవసరం లేకున్నా గేట్లు మూసేయడం, కనిపించిన వాళ్లందరినీ పక్కకు తోసేయడం, తమ కండబలం చూపించడం వంటి చేష్టలే ఫ్యాన్స్‌ తొక్కిసలాటకు కారణమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ సంఘటన పర్యవసానం చివరకు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ సినిమా ఇండస్ట్రీగా తయారయ్యింది. టాలీవుడ్‌ ప్రముఖులందరూ ప్రభుత్వం ముందుకు రాయబారానికి వెళ్లాల్సి వచ్చింది.

అంతేకాదు.. హైదరాబాద్‌ శివారుల జల్‌పల్లిలో మంచు మోహన్‌బాబు ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులకు బౌన్సర్లే కారణమయ్యారని చెబుతున్నారు. బౌన్సర్ల అత్యుత్సాహమే అక్కడ ఉద్రిక్తతలు సృష్టించిందని, వాళ్ల ఓవర్‌ యాక్షనే మీడియా వర్సెస్‌ మోహన్‌బాబు ఫ్యామిలీగా మారేందుకు దారితీసిందని చెబుతున్నారు.

ఈ రెండు సంఘటనలు ఇటీవలే జరిగాయి. అయితే, తరచూ బౌన్సర్ల వ్యవహారం వివాదాలకు దారితీస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇక, ఇప్పుడు జూలు విదిల్చింది. బౌన్సర్ల ఆగడాలను సహించేది లేదని స్పష్టం చేసింది. తామేదో అతీతులమన్నట్లు వ్యవహరిస్తే ఇకపై తోలు తీయాల్సి వస్తుందని చెప్పకనే వార్నింగ్‌ ఇచ్చింది. ఇవాళ హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు, సినీ హీరోలు భేటీ అయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వం బౌన్సర్ల వ్యవహారాన్ని కూడా ప్రస్తావించింది. దీనికి టాలీవుడ్‌ ప్రముఖులు కూడా అంగీకరించారు. బౌన్సర్ల ఓవరాక్షన్‌ తగ్గించేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఇన్నాళ్లుగా తాము సాగించిన ఆగడాలకు ఏకంగా రాష్ట్రప్రభుత్వమే ప్రస్తావించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు బౌన్సర్లు. దీనికి సెలబ్రిటీలు కూడా అభ్యంతరం తెలపలేని వాతావరణం నెలకొంది.

ఇక, సెలబ్రిటీల సంగతి చూసుకుంటే.. ప్రధానంగా సినీ ప్రముఖులు బౌన్సర్లను ఎక్కువగా వెంటేసుకొని తిరుగుతుంటారు. దీనికి కూడా ఓ కారణం ఉంది. స్వతహాగా సినిమాలతో సెలబ్రిటీలుగా ఉన్నవాళ్లు తమ ప్రైవసీ కోసం, తమ రక్షణ కోసం బౌన్సర్లను వినియోగించుకుంటూంటారు. దీంతో, సినీ ప్రముఖులు ముఖ్యంగా హీరోలు, హీరోయిన్‌లు తాము ఇల్లు దాటి బయటకు వచ్చామంటే చాలు.. బౌన్సర్లు లేకుండా అడుగు కూడా వేయలేరు. ఇది అనివార్యంగా మారిపోయింది. ఈ పరిస్థితులను బౌన్సర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఒక్క తమ బాస్‌ల దగ్గరే అణగిమణిగి ఉంటారు. బయటివాళ్లు ఎవరైనా సరే.. లెక్కచేయరు. వీళ్లు కూడా తమకు రక్షణకల్పిస్తున్నారు కదా.. అని వాళ్ల ఆగడాలను పట్టించుకోరు. ఈ పరిస్థితులే ముదిరిపోతున్నాయి. ఒకరకంగా తొక్కిసలాటలు జరగడం, ఘర్షణలు చెలరేగడం వంటి పరిణామాలు బౌన్సర్ల కారణంగానే తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. ఫలితంగా తెలంగాణ పోలీసులు కొంతకాలంగా బౌన్సర్లపై గుర్రుగా ఉండటం, ఇప్పుడు ఏకంగా రాష్ట్రప్రభుత్వమే సెలబ్రిటీలకు దిశానిర్దేశం చేయడంతో సినీ ప్రముఖుల పరిస్థితి ‘కక్కలేక.. మింగలేక’ అన్నట్లుగా తయారయ్యింది.

మరి.. బౌన్సర్లు లేకుండా సినీ ప్రముఖులు ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? వాళ్ల సొంత కార్యక్రమాలైనా, పొరుగువాళ్ల సెలబ్రేషన్స్‌ అయినా, తోటి సినీ హీరోల ఫంక్షన్స్‌ అయినా బౌన్సర్లను వెంట తెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. దీనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఒక కారణమైతే, కొంతమంది నటులకు.. ఇతర నటులతో విభేదాలు ఉండటం కూడా మరో కారణం. అభిమానులు ఆనందంతో తమ ఆరాధ్య నటుడు వచ్చాడన్న ఉత్సాహంలో చుట్టుముడితే గాలి ఆడని పరిస్థితి నెలకొంటుంది. లేదంటే ఎవరైనా పోటీ నటుడి ఫ్యాన్స్‌ తనపై దాడికి పాల్పడే ప్రమాదమూ ఉంటుంది. ఇక, వాళ్లు షాపింగ్‌కు వెళ్లాలన్నా, ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలన్నా, ఏదైనా ఫంక్షన్‌కు హాజరు కావాలన్నా బౌన్సర్లను వెంటేసుకెళ్లడం తప్పనిసరిగా మారింది. మరి.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్‌తో ఇకనుంచైనా బౌన్సర్లు కాస్త బుద్ధిగా మసలుకుంటారా? లేదంటే సర్కారుకు మాటిచ్చిన తమ బాస్‌లకు కళంకం తెస్తారా? అన్నది బౌన్సర్ల వ్యవహారశైలి, అనుసరించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com