భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు భారత రత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మన్మోహన్‌కు నివాళులర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రధానిగా మన్మోహన్ తన పదవి కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో దేశ దశదిశ మార్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ అందించిన సేవలు మరువలేనివన్నారు. ఆర్థిక రంగంలో మన్మోహన్ దేశానికి మార్గదర్శి అని, ప్రపంచ దేశంలో భారత్ ను మేటి దేశంగా నిలిపిన మన్మోహన్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని అన్నారు రేవంత్. తెలుగుబిడ్డ పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్ ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచంతో పోటీ పడేలా భారత్‌ను తీర్చిదిద్దారని కొనియాడారు.
దేశ ఆర్థిక స్థితిగతులకు దశ, దిశ నిర్దేశం చేసిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని.. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో బారత ఆర్థికవ్యవస్థ సుస్థిరంగా ఉండేలా చేయగలిగారని ప్రశంసించారు. మన్మోహన్‌సింగ్ హయాంలో అనేక చారిత్రాత్మక, సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, అందరికీ ఆధార్‌కార్డు సామాజిక విప్లవాత్మక కార్యక్రమం వంటివి మన్మోహన్ సింగ్ హయాంలోనే అమలులోకి వచ్చాయన్నారు. భూసేకరణ చట్టంతో బాధితులకు న్యాయం చేశారని అన్నారు.
నీతి నిజాయితీ విషయంలో మన్మోహన్ సింగ్‌తో పోటీ పడేవారు నేటి తరంలో ఎవరూ లేరన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. 60ఏళ్ల కల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని చెప్పారు. మన్మోహన్‌సింగ్ దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు.