ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాస్ విక్టరీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఇక.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేయాలన్న అంశంపై తర్జన భర్జనలు పడుతోంది. ఆశావహుల చరిత్ర, సామర్థ్యం, దేశ రాజధాని ఢిల్లీలో పాలన సాగించగల సత్తా ఉన్న నాయకుడిని ఎంపిక చేసే పనిలో పడింది.
పర్వేష్ సింగ్ వర్మ :
ఢిల్లీ సీఎం రేసులో ముందున్నారు పర్వేష్ సింగ్ వర్మ. రిజల్ట్ రిలీజ్ అయిన నాటి నుంచీ పర్వేష్ పేరు మారుమోగి పోతోంది. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు పర్వేష్ వర్మ. 2019 ఎన్నికల్లో 5.78 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యంత భారీ మెజారిటీ. ఇక, ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. కేజ్రీవాల్‌ను 4,099 ఓట్ల తేడాతో ఓడించారు పర్వేష్ వర్మ. పర్వేష్ వర్మకు చిన్నప్పటి నుంచీ ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది. ఇప్పటివరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ పర్వేష్ వర్మ విజయం సాధించారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన పర్వేష్ వర్మను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది. పశ్చిమ యూపీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యంత బలమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పర్వేష్. పర్వేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే.. ఆయా రాష్ట్రాల్లోని జాట్ సామాజిక వర్గాన్ని బీజేపీ తనవైపునకు తిప్పుకునే చాన్స్ ఉంటుంది. ఇక, తాను గెలిచిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు పర్వేష్. ఇది కూడా ఆయనకు కలిసివచ్చే అంశమే.
సతీష్ ఉపాధ్యాయ్ :
ఢిల్లీ ముఖ్యమంత్రి పోటీలో వినిపిస్తున్న రెండో పేరు సతీష్ ఉపాధ్యాయ్. ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం సతీష్ ఉపాధ్యాయ్‌కు ఉంది. సతీష్ ఉపాధ్యాయ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రస్తుతం ఎన్డీఎంసీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పరిపాలనా అనుభవం కూడా ఉంది. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఉంది. అంతేకాదు.. ఆర్ఎస్ఎస్తో కూడా సతీష్ ఉపాధ్యాయ్‌కు బలమైన అనుబంధం ఉంది. ఢిల్లీలో 12 నుంచి 14 శాతం బ్రాహ్మణుల జనాభా ఉంది. దీంతో, సతీష్ ఉపాధ్యాయ్ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తోంది.
అశీష్ సూద్ :
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్న మూడో పేరు ఆశీష్ సూద్. ఢిల్లీలో భారతీయ జనతాపార్టీకి ఇప్పుడు ఈయన పంజాబీ ఫేస్‌గా ఉన్నారు. పార్టీలో పంజాబీలకు అశీష్ సూద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశారు. ప్రస్తుతం గోవా ఇన్చార్జ్, జమ్మూ కాశ్మీర్ సహ-ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర నాయకులతో ఆశీష్ సూద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన రికార్డ్ ఆయనకు ఉంది.
జితేంద్ర మహాజన్ :
ఢిల్లీ సీఎం పోటీలో నెంబర్ ఫోర్ వినిపిస్తోన్న పేరు జితేంద్ర మహాజన్. వైశ్య సామాజికవర్గానికి చెందిన నాయకుడాయన. ఈయనకు కూడా ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు ఈయనకు అనుకూలించవచ్చని చెబుతున్నారు.
విజేందర్ గుప్తా :
ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్న ఐదో పేరు విజేందర్ గుప్తా. ఈయన కూడా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హవా ఉన్నప్పటికీ, విజేందర్ గుప్తా విజయం సాధించారు. ఢిల్లీ సీఎం ఆశావహుల జాబితాలో, పరిశీలన జాబితాలో ఈయన పేరు కూడా ఉంది.
మంజీందర్ సింగ్ సిర్సా :
ఇప్పటిదాకా చెప్పుకున్న నేతలే కాదు.. మరికొంత మంది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో తాము ఉన్నామంటున్నారు. ఈ జాబితాలో ఆరో పేరు మంజీందర్ సింగ్ సిర్సా. 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ టికెట్‌పై ఈయన విజయం సాధించారు. ఆ తర్వాత రాజౌరి గార్డెన్ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2021లో శిరోమణి అకాలీదళ్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజీందర్ సింగ్ సిర్సాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే.. పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుందన్న అంచనాలున్నాయి.