- పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై మండిపాటు
- మీరుండగా ఎలా జరుగుతుందని ఎమ్మెల్యే కొండబాబుపై ఆగ్రహం
కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న షిప్ ను శుక్రవారం డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ సందర్శించారు. కాకినాడ పోర్టు నుంచి ఆప్రికన్ దేశాలకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న షిప్ ను మూడు రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ పట్టుకుని షిప్ ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు కాకినాడ పోర్టు విజిట్ చేసి అక్రమంగా రవాణ అవుతున్న బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 38వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి చెయ్యడానికి ప్రయత్నించారని దీన్ని ఎవరు సరఫరా చేశారని ఆరా తీస్తున్నామని చెప్పారు. బియ్యం శాంపిల్స్ ని పరిశీలించి పీడీఎస్ బియ్యంగా గుర్తించిన పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న కాకినాడ అర్బన్ టీడీపీ శాసనసభ్యుడు కొండబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టుకు రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుందని, మీరు కూడా కంప్రమైజ్ అయితే ఎలా అని అందుకేనా మనం పోరాటం చేసేదని నిలదీశారు. అంతకు ముందు సముద్రంలోకి బోట్ లో 9 నాటికల్ మైల్స్ దూరంలో సీజ్ చేసిన షిప్ వద్దకు వెళ్లి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యాన్ని పరిశీలించారు.