నాగార్జున యూనివర్సిటీలో తొమ్మిదేళ్ల క్రితం ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసును గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టేసింది. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆర్కిటెక్చర్ చదువుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల పాటు న్యాయస్థానాల్లో విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు కోర్టు ఈ కేసును కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది.
తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సులో చేరింది. అయితే, 2015 జూలై 14వ తేదీన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తనపై సీనియర్ల వేధింపులు, కొందరి వ్యవహార శైలి.. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ సమయంలో సూసైడ్ నోట్ రాసింది. ఆ సమయంలో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రిషితేశ్వరి సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ తర్వాత చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు ఈకేసు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కోర్టు ఇవాళ తుదితీర్పు వెలువరించింది.