అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కెనడాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆయన కొనసాగనున్నారు. దీనిపైనే ట్రంప్ స్పందించారు.
ట్రూడో ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలుసన్నారు అమెరికా నూతన అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్. కెనడా వాణిజ్య లోటును, టారీఫ్‌లను ఇక అమెరికా భరించదని ట్రూడోకు తెలుసని అందుకే ముందు జాగ్రత్తగా ఆయన రాజీనామా చేశారన్నారు ట్రంప్. అంతేకాదు కెనడా అమెరికాలో విలీనం కావాలన్నారు. అలా చేస్తే పన్నులుండవని తెలిపారు. కెనడా ప్రజలకు కూడా అమెరికాలో విలీనం కావడం ఇష్టమే అన్నారు ట్రంప్. అంతేగాకుండా రష్యా, చైనా షిప్‌ల నుంచి రక్షణ లభిస్తుందన్నారు ట్రంప్.
ట్రంప్ వ్యాఖ్యలతో మరోసారి ఈ విలీనం విషయం తెరపైకి వచ్చింది. మరి నిజంగా ట్రంప్ చెబుతున్నట్టుగా కెనడా విలీనం అవుతుందా? అనేది చూడాలి. కానీ ట్రూడో టార్గెట్‌గా ట్రంప్ అడుగులు వేయడం ఇది కొత్తేం కాదు. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రూడోతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఈసారి అధ్యక్షుడు కాకముందు నుంచే ఆయనను టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేశారు.
తాను అధికారంలోకి రాగానే 25 శాతం టారిఫ్‌లను పెంచుతానన్నారు ట్రంప్. అంతేకాదు కెనడా అక్రమ వలసలకు కేరాఫ్‌గా మారిందని.. వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.