32.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

కాళేశ్వరం కేసులో కేసీఆర్‌ విచారణ

– పీసీ ఘోష్ కమిషన్‌ యోచన
– ఈనెల 22న విచారించే అవకాశం
– నేరుగా రాకున్నా.. వర్చువల్‌గా అయినా విచారణ
– హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ను కూడా…
– అంతకుముందే అధికారుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కొనసాగిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఈనెలమూడో వారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించేందుకు ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతోపాటు ఆర్థిక అవకతవకలపైనా జస్టిస్‌ పినాకినీ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు పిలవాలని భావిస్తోంది. సంక్రాంతి తర్వాత ఈనెల 17వ తేదీన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ హైదరాబాద్‌కు రానున్నారు. 18వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ప్రక్రియపై పురోగతి విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక, 20, 21వ తేదీల్లో.. అధికారులను క్రాస్‌ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. ఆ తర్వాత 22వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందిగా మాజీ కేసీఆర్‌కు నోటీసులు పంపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్‌ తాను నేరుగా విచారణకు హాజరు కాలేనని చెప్పినా.. వర్చువల్‌గా అయినా విచారణకు కమిషన్‌ సమ్మతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మాజీ ఎస్‌ఈ మురళీకృష్ణ అమెరికాలో ఉండగా.. ఆయనను కూడా ఇప్పటికే వర్చువల్‌గా విచారించారు. ఒకవేళ కేసీఆర్‌ అనారోగ్య సమస్యలను కారణంగా చెబుతూ.. లేఖను రాసినా, దాన్ని ప్రామాణికంగా చేసుకుని, విచారణను కొనసాగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. విద్యుత్తు కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యింది. జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

– హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ను కూడా…

కాగా.. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం విషయంలో ఈనెల 23వ తేదీన మాజీ మంత్రి హరీశ్‌రావును, 24వ తేదీన ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా విచారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వీరిద్దరూ కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు కచ్చితంగా హాజరు అవుతారని కమిషన్‌ భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని హెడ్‌వర్క్‌లతోపాటు ఇతర ప్రధాన పనులు జరిగిన సమయంలో అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నారు. అయితే, ఈటలను బీఆర్‌ఎస్‌ నుంచి పొమ్మనలేక పొగబెట్టారని, కాబట్టి ఈటలను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కమిషన్‌ భావిస్తోంది. ఒకవేళ విచారణకు పిలిస్తే ఈటల రాజేందర్‌ సంచలన విషయాలను వెల్లడించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. కాగా.. ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌ వస్తున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పీసీఘోష్‌ నెలరోజులపాటు ఈ విచారణలోనే నిమగ్నమవుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రభుత్వానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికను సమర్పించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com