హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:12 గంటలకు జీరో షాడో డే సంభవించనుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రత్యేక ఖగోళిక సన్నివేశం. ఈ సమయంలో నిలువుగా ఉంచిన వస్తువులకు కొన్ని క్షణాల పాటు నీడ ఏర్పడదు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు నిట్టనిలువుగా ఉంటాడు.
జీరో షాడో డే ఎందుకు సంభవిస్తుంది? :
జీరో షాడో డే సంభవించడానికి కారణం భూమి 23.5 డిగ్రీల ఒరిపాటు (axial tilt) కలిగి ఉండటమే అని ప్లానిటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ చెప్పారు. దీనివల్ల సూర్యుడు ఆకాశంలో తన దిశను మార్చుకుంటూ కదలుతుంటాడని వెల్లడించారు.
సాధారణ రోజుల్లో, సూర్యుడు తూర్పు నుండి పడమర దిశగా ఒక కోణంలో కదలుతాడని. అందువల్ల మనకు కనిపించే నీడలు వివిధ కోణాలలో పడతాయని.. కానీ, జీరో షాడో డే నాడు మాత్రం, సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడతాయని, ఆ సమయంలో నిలబడి ఉన్న వస్తువుల కింద నీడ పూర్తిగా కనిపించదని.. కొన్ని క్షణాల పాటు నీడ పూర్తిగా మాయమవుతుందని రఘునందన్ కుమార్ వివరించారు.
భూమిపై కర్కాటక రేఖ (Tropic of Cancer – 23.5°N), మకర రేఖ (Tropic of Capricorn – 23.5°S) మధ్య ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రెండు సార్లు సూర్యుడు నిట్ట నిలువుగా కనిపించే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ (17.4°N) వంటి నగరాల్లో, ఇది ఏడాదికి రెండు సార్లు జరుగుతుందని, ఒకసారి సూర్యుడు ఉత్తర దిశగా కదలుతున్నప్పుడు (ఉత్తరాయణం సమయంలో), మరొకసారి దక్షిణ దిశగా కదలుతున్నప్పుడు (దక్షిణాయణం సమయంలో) సంభవిస్తాయని తెలిపారు.
ఈ సంవత్సరం మొదటి జీరో షాడో డే ఇవాళ మధ్యాహ్నం 12:12 గంటలకు సంభవిస్తుందని, రెండవది ఆగస్టు 2025 లో సంభవిస్తుందని పేర్కొన్నారు.
ఏం చేయాలి? ఎలా గమనించాలి? :
ఆకాశం స్పష్టంగా ఉంటే.. అలాగే సూర్యుడు మేఘాల మాటుకు వెళ్లకుంటే ఒక సూటిగా ఉన్న వస్తువును (ఉదా: ప్లాస్టిక్ ట్యూబ్, స్టిక్ లేదా నీళ్ళ బాటిల్) నేలపై ఉంచాలని, ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ప్రతి 5 నిమిషాలకు దాని నీడను గమనించాలని, ప్రత్యేకంగా 12:12 నిమిషాలకు, నీడ ఎలా మారుతుందో గమనించాలని రఘునందన్ కుమార్ సూచించారు. ఆ సమయంలో నీడ పూర్తిగా కనిపించకుండా పోతున్న దృశ్యాన్ని చూసే అద్భుతమైన అవకాశం కలుగుతుందని, అదే జీరో షాడో ఘట్టం అని ఆయన వివరించారు.
జీరో షాడో డే ఖచ్చితమైన తేదీ ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుందని ఆయన తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో గమనించలేకపోతే లేదా ఆకాశం మేఘావృతంగా ఉంటే, మరుసటి రోజు లేదా ఈ వారం చివరలో ప్రయత్నించవచ్చని, అయితే, ఆ సమయంలో నీడ పూర్తిగా మాయమవడం చూడలేకపోవచ్చని.. అయినా, ఇది సూర్యుని కదలికలపై అవగాహన పెంచుకునే అద్భుతమైన అవకాశం అని రఘునందన్ కుమార్ తెలిపారు.
రెండవ జీరో షాడో డే – ఆగస్టు 2025 :
ఇక, తెలుగు రాష్ట్రాల్లో ఈ యేడాది ఆగస్టులో రెండవ జీరో షాడో డే సంభవిస్తుందని, ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని మళ్లీ గమనించేందుకు క్యాలెండర్‌లో తేదీని గుర్తుంచుకోవాలని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ సూచించారు.