భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత సరిహద్దు ప్రాంతమైన జమ్మూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ మెరుపుదాడుల నుంచి తేరుకున్న పాకిస్తాన్.. తన ఉనికిని చాటుకునే ప్రయత్నంగా మళ్లీ దాడులకు దిగింది. జమ్మూ సమీపంలోని ఉన్న సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లపై పాక్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఎనిమిది మిస్సైళ్లను గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాడుల నేపథ్యంలో అఖ్నూర్, కిష్త్వార్, సాంబా ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. జమ్మూ జిల్లాలో సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇళ్లలోనే ఉండాలని సైన్యం కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. పలు సరిహద్దు నగరాల్లో బ్లాక్‌అవుట్ ప్రకటించారు.
జమ్మూ, పఠాన్‌కోట్, ఉధమ్‌పుర్ ప్రాంతాల్లో కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం. సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని తెలుస్తోంది. పలుచోట్ల భారీ శబ్దాలు వినిపించాయి. అఖ్నూర్ సహా ఇతర ప్రాంతాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోకి చేరుకున్నారు. ఈ ఉద్రిక్తతల దృష్ట్యా జమ్మూ, కుప్వారా జిల్లాల్లో విద్యుత్ సేవలు నిలిపివేశారు.
ఇక డ్రోన్ దాడులకు గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిస్పందిస్తున్నాయి. జమ్మూ యూనివర్శిటీ సమీపంలో రెండు డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. వాతావరణం మొత్తం హైఅలర్ట్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్, లష్కరే తొయ్యిబా వంటి ఉగ్రసంస్థలు భద్రతాదళాలపై ఆత్మాహుతి దాడులకు యత్నించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ కారణంగా జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యమైన ఆలయాలు, నీటి ప్రాజెక్టులకు భద్రత కట్టుదిట్టం చేశారు.
అంతేగాక, పంజాబ్‌లోని గుర్‌దాస్‌పుర్ జిల్లాలో రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఆసుపత్రులు, కేంద్ర జైళ్లకు ఈ ఆంక్షలు వర్తించకపోయినా, వాటి కిటికీలు పూర్తిగా మూసివేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.