ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల ఓవరాక్షన్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఓ రకంగా పోలీసులకే మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు తమ డ్యూటీ తాము సక్రమంగా చేయాలని, టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టడం మానేసి టోపీ మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఏపీలో అధికారంలో ఉండదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని.. ఇప్పుడు అన్యాయం చేస్తే.. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అధికారుల బట్టలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.
విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులపై సంచలన కామెంట్స్ చేసారు వైఎస్ జగన్. అధికార తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ కొందరు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని… అలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం పనిచేయడం మానేసి.. తమ టోపీపై ఉండే మూడు సింహాలకు సెల్యూట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు.
గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు.. ఆ సంఘటనపై ఫిర్యాదుచేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించారన్న కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వల్లభనేని వంవీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైధీగా ఉన్నారు. ఇవాళ వైఎస్ జగన్.. విజయవాడ జైల్లో వంశీని పరామర్శించారు. అనంతరం అదే జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
గుర్తు పెట్టుకో సీఐ :
వంశీని అరెస్ట్ చేసే సమయంలో ఓ సీఐ చాలా దురుసుగా ప్రవర్తించాడని తెలిసిందని, అంతేకాదు.. మరికొద్దిరోజుల్లోనే తాను పదవీ విరమణ అవుతున్నాను కాబట్టి మీరేం చేయలేరని కూడా అన్నాడని తెలిసిందని, ఇలాంటి పోలీసులకు చెబుతున్నా. మీరు రిటైరయి సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తామని… బట్టలు ఊడదీస్తామని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో భాగస్వాములు కావద్దని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్ జగన్ పోలీసు అధికారులను హెచ్చరించారు. ఎవరికి వాళ్లు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని పోలీసులకు సూచించారు. కాదు.. కూడదని ఓవరాక్షన్ చేస్తే ఆ దేవుడు, ప్రజలే శిక్షిస్తారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
వైసీపీ ఆఫీసుమీదే ముందుగా దాడి :
అసలు వైసీపీ ఆఫీసు మీదే ముందుగా దాడి జరిగిందని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి జరిగిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పరస్పరం ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. 2023 ఫిబ్రవరి 20వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం గన్నవరం వచ్చాడని జగన్ తెలిపారు. అంతకుముందే వల్లభనేని వంశీని ఉద్దేశించి పట్టాభి రెచ్చగొట్టేలా మాట్లాడాడని.. ‘వాడో పిల్ల సైకో…నేనే గన్నవరం వెళతా…వంశీ సంగతి తేలుస్తా’ అని పట్టాభిరాం ఆరోజు చేసిన వ్యాఖ్యలను వైఎస్ జగన్ గుర్తు చేశారు. అంతేకాకుండా.. కొందరు అనుచరులను వెంటేసుకొని పట్టాభిరాం.. గన్నవరం వచ్చి మళ్లీ వల్లభనేని వంశీని తిట్టాడని.. అక్కడితో ఆగకుండా వైసీపీ కార్యాలయంపై దాడికి పట్టాభి బయలుదేరాడని జగన్ తెలిపారు. ఆ సమయంలో వైసీపీ కార్యాలయం బయట ఉన్న దళిత సర్పంచ్ సీనయ్యపైనా పట్టాభిరాం మనుషులు దాడి చేశారని వివరించారు. అప్పుడు అక్కడున్న పోలీసులు టీడీపీ శ్రేణుల దాడిని ఆపడానికి విశ్వప్రయత్నం చేసారని, ఈ క్రమంలోనే సిఐ కనకరావు తలను టీడీపీ నాయకులు పగలగొట్టారని.. ఆ వివరాలు గుర్తు లేవా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
బాధ్యత కలిగిన నాయకులను తిట్టడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం.. అంతటితో ఆగకుండా భౌతిక దాడులకు దిగడంతోనే వైసీపీ నాయకులు ప్రతిచర్యగా టీడీపీ కార్యాలయంపై దాడి చేసేందుకు వెళ్లారని జగన్ వెల్లడించారు. ఆ రోజు రెండు పార్టీ కార్యాలయాలపై పరస్పరం జరిగిన దాడులకు సంబంధించి పోలీసులు అప్పుడే రెండు వైపులా కేసులు పెట్టారని చెప్పారు. అయితే ఈ గొడవల్లో ఎక్కడా వల్లభనేని వంశీ జోక్యం చేసుకోలేదని, గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్థన్ స్టేట్‌మెంట్‌లో కూడా వల్లభనేని వంశీ పేరు ఎక్కడా లేదని జగన్ గుర్తు చేశారు. కానీ, ఆ తర్వాత చంద్రబాబు సత్యవర్థన్‌ను పిలిపించుకొని.. తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని, ఆ తర్వాత తన తరపు వాల్లతో ఫిర్యాదు ఇప్పించారని వైఎస్ జగన్ వివరించారు.
వాస్తవానికి 2023, ఫిబ్రవరి 23వ తేదీన పోలీసులు. .సత్యవర్థన్ నుంచి 161 స్టేట్‌మెంట్ తీసుకున్నారని, అందులో కూడా వల్లభనేని వంశీ పేరు ఎక్కడా లేదని జగన్ పేర్కొన్నారు. తనను ఎవరూ కులం పేరుతో తిట్టలేదని కూడా చెప్పాడని, అసలు సంఘటన జరిగినప్పుడే తాను అక్కడినుండి వెళ్లిపోయానని సత్యవర్థన్ స్టేట్ మెంట్ ఇచ్చాడని వైఎస్ జగన్ వెల్లడించారు. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024, జూలై 10వ తేదీన ఈ కేసును రీ ఓపెన్ చేశారని జగన్ మండిపడ్డారు. ఆ తర్వాత మరోసారి సత్యవర్థన్ నుండి 161 స్టేట్ మెంట్ రెండోసారి తీసుకున్నారని తెలిపారు. అప్పుడుకూడా సత్యవర్ధన్ తనను ఎవరూ తిట్టలేదని.. వల్లభనేని వంశీ అక్కడ లేడని కూడా స్పష్టం చేశాడన్నారు. కానీ, వంశీమీద కోపంతో, అతన్ని 71వ నిందితుడిగా చేర్చారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి వల్లభనేని వంశీపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కేసులేనని.. అందుకే కొత్తగా ఎస్సీ, ఎస్టీ కేసు యాడ్ చేశారన్నారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేసాడని మరోకేసు పెట్టించారని జగన్ తెలిపారు. ఆ ఆఫీసు ఎస్సీ, ఎస్టీలదని చెప్పి ఈ కేసు పెట్టించారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కానీ, ఆ భవనం కడియాల సీతారామయ్య అనే ఓసీకి చెందిన వ్యక్తిదని, సీతారామయ్య కూడా చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి అని జగన్ వివరించారు.
సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసింది టీడీపీ నేతలే :
సత్యవర్ధన్‌తో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించేందుకు అనేకసార్లు సమన్లు జారీ చేసారని, అయినా ఈ కేసులో వల్లభనేని వంశీని ఇరికించాలన్న దురుద్దేశ్యంతో సత్యవర్థన్‌ను హాజరుకాకుండా అడ్డుకున్నారని జగన్ తెలిపారు. ఇలా 20 సార్లు సమన్లు పంపించినా కోర్టుకు రాకపోవడంతో పోలీసులపై జడ్జి సీరియస్ అయ్యారని, ఖచ్చితంగా తీసుకురావాల్సిందేనని న్యాయమూర్తి హెచ్చరించారని తెలిపారు. దీంతో, చేసేదేమిలేక పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చాడని తెలిపారు. అప్పుడు కూడా సత్యవర్ధన్ 161 స్టేట్ మెంట్‌లో చెప్పిందే చెప్పాడని జగన్ స్పష్టం చేశారు. తాను, తన తల్లి ఆటోలో కూర్చుని వచ్చామని, స్టేట్‌మెంట్ వెనక ఎవరి బలవంతం లేదని సత్యవర్థన్ 2025 ఫిబ్రవరి 10వ తేదీన స్టేట్‌మెంట్ ఇచ్చాడన్నారు. దీంతో, చంద్రబాబు, లోకేష్‌కు మనశ్శాంతి లేకుండాపోయిందని, అందుకే పోలీసులతో కుట్రపన్ని ఫిబ్రవరి 11వ తేదీన సత్యవర్థన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సాక్ష్యం ఇచ్చాడని కేసు నమోదు చేసారని జగన్ తెలిపారు. సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి ఫిబ్రవరి 12వ తేదీన సత్యవర్థన్ అన్ననుండి తప్పుడు ఫిర్యాదు చేయించారని జగన్ తెలిపారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసుకుని పోయాడని.. రూ.20 వేలు లాక్కున్నారని ఫిర్యాదు చేయించారని.. దీంతో ఫిబ్రవరి 13వ తేదీన ఉదయాన్నే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసారన్నారు. కానీ, ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి సత్యవర్థన్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఇలా.. వంశీ అరెస్ట్ వెనక హైడ్రామా నడిచిందని.. నిజానికి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసింది వంశీ కాదు.. తెలుగుదేశం పార్టీ నాయకులే అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.