26.7 C
Hyderabad
Sunday, April 26, 2026

Live Video

spot_img

చిన్న కష్టమొచ్చినా ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత

  • చదువుల స్ట్రెస్ తో ఆత్మహత్యలు
  • పిల్లలకు ర్యాంకులు రావాలని పెద్దల అగచాట్లు
  • పసి పిల్లలపై చదువుల భారం
  • ఒంటరి జీవితాలతో మరింత దుర్భరం
  • చిన్న కుటుంబాలతో వస్తున్న పెద్ద చిక్కు
  • యాంత్రికతతో నా అన్న పలకరింపు లేక ఆత్మహత్య
  • తమిళనాడు, తెలంగాణలలో ఎక్కువ యువత ఆత్మహత్యలు
  • ఏపీలో ఎనిమిదేళ్లలో 57 శాతం పెరిగిన విద్యార్ధుల ఆత్మహత్యలు
  • దేశంలో 30 ఏళ్ల లోపు వారి ఆత్మహత్యలు 41 శాతం
  • ఆలోచించండి ఓ.. అమ్మా నాన్నా!!

కాకినాడలో చిన్న పిల్లలను చంపేసి, ఓ తండ్రి తానూ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది. డబుల్ పీజీ చేసి ఓఎన్ జీసీలో ఏడేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగి హోలీ రోజు ఓఎన్‌ జీసీలో హోలీ వేడుకలకు భార్య, పిల్లలతో సహా హాజరయ్యాడు. సంతోషపు సంబరాల్లో మునిగి తేలుతుండగానే భార్యను అక్కడే ఉండమని పిల్లలు ఇద్దరినీ తీసుకుని ఇంటికొచ్చి వారి కాళ్లు, చేతులు కట్టేసి బక్కెట్‌ నీళ్లలో తలలు ముంచేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు చెబుతున్న కారణాలు మాత్రం ఎల్‌ కేజీ, యూకేజీ చదువుతున్న ఆరేళ్లు, ఐదేళ్ల వయసున్న ఆ పిల్లలు సరిగా చదవడం లేదని చంపేశానని సూసైడ్‌ నోట్‌ లో రాశాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఆరునెలల క్రితమే రెండు లక్షలు కట్టి వారిని ఓ కాన్వెంట్‌ లో చేర్చినా, అక్కడ వారికి చదువు అబ్బడం లేదని మూడు నెలల క్రితం 50 వేల చొప్పున కట్టి ఇద్దరినీ మరో స్కూలులో జాయిన్ చేశాడు. అక్కడ కూడా వారికి చదువు రావడం లేదని ఆందోళన చెందుతున్నట్లు తండ్రి సూసైడ్‌ నోట్‌ లో ఉంది. ఇది ప్రాధమిక సమాచారం మాత్రమే. అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పిల్లలను చంపడమే కాక తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ తండ్రి కూడా విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నాడని అర్ధం.
అసలు పట్టుమని సరిగా మాటలుకూడా రాని చిన్నారులను చదువు రావడం లేదని చంపేయడం అంటే ఈ మధ్యకాలంలో తల్లి దండ్రులు, లేదా యుక్త వయస్కులలో చదువుల ఒత్తిడిని అర్ధం చేసుకోవచ్చు. కాంపిటీటివ్‌ వాల్డ్ లో సరైన చదువు లేకపోతే ఉద్యోగం రాదని, వారు సమాజానికి, తమకూ భారం అవుతారని తల్లి దండ్రులు భయపడుతున్నారు. దీనికి కారణం కార్పొరేట్‌ చదువులు తెచ్చిన ర్యాంకింగ్ మానియా.పేరు న్న స్కూళ్లలో వేస్తే పిల్లలకి చదువు అబ్బుతుందన్నది మూర్ఖత్వం. పైగా ఆవయసు లోనే వారి చదువులపై అంత ఒత్తిడి ఉందంటే స్ట్రెస్, పోటీ తత్వం ఎంతలా పెరిగిపోతోందో అర్ధం చేసుకోవచ్చు.ఈ ఉద్యోగే కాదు ఈమధ్యకాలంలో పెద్ద చదువులు చదవలేక, చదివినవి గుర్తుండటం లేదని, ర్యాంకులు రావడం లేదని చాలా మంది యువత ఆత్మహత్యల బాటపడుతున్నారు. కొందరైతే తమపై ఆశలు పెట్టుకోవద్దని చదవలేకపోతున్నామని తనువు చాలించిన వారున్నారు. ఇన్ని ఘటనలు జరిగినా మన పేరెంటింగ్‌ లో ఈ స్ట్రెస్ లెవెల్ తగ్గడం లేదు.నిజానికి మానసికంగా దిగులుగా, కుంగిపోయి ఉన్న వారిని గమనించిన వారు అలా వదిలేయకుండా సకాలంలో స్పందించి వారి ఆందోళనను వారితో మాట్లాడటం ద్వారా తగ్గించే ప్రయత్నం చేయాలి.

పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు..

ప్రత్యేకించి మానసిక ఇబ్బందులతో బాధపడే పిల్లలను చదువులో రాణించమంటూ ఒత్తిడి చేయడం అస్సలు మంచిది కాదని ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో కమలాకర్ అంటున్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే ఏదో ఒక రంగంలో ఆసక్తి ఉంటుందని ఆ ఆసక్తిని తల్లి దండ్రులు గమనించి ప్రోత్సహించాలని ఆయనన్నారు. ఆరంగంలో వారికున్న ప్రత్యేక ఆసక్తులు గమనించి వెన్నుతడితే వారు పైకి వచ్చే అవకాశముందన్నారు.చదువు రాని పిల్లలను వేస్ట్ అనుకోవడం తప్పని, వారి అభిరుచులను గమనించక బలవంతపు చదువులు చెప్పించి వారిని బలి తీసుకోరాదని అన్నారు.

అసలు కుంగుబాటు అంటే?

మానసిక కుంగుబాటు.. అనేక వ్యాధులకు ఇది మూలం.పూర్వకాలం ఇది ఒక వ్యాధికింద భావించేవారు కాదు.. కానీ ఇప్పుడు ఇదొక జాడ్యమై కూర్చుంది. ఈ తరంలో ప్రత్యేకించి యువతరం, నడి వయస్కుల్లో ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. దానికి మూల కారణం విపరీతమైన స్ట్రెస్..అవగాహనా లోపం. జీవితం పట్ల కొంత మందికి అవగాహన ఉండటం లేదు. ఒత్తిడిని తట్టుకునే మానసిక సామర్ధ్యం అసలే లేదు.చాలా చాలా సున్నిత స్వభావం వల్ల ఏ చిన్న మాట అన్నా సహించలేకపోతున్నారు.ఆఫీసర్ అవమానించాడనో, తాను చెప్పిన కూర వండలేదని ఓ భర్త, సినిమాకు తీసుకు వెళ్ల లేదని భార్య,వేరింటి కాపురం పెట్టలేదని ఓ కోడలు ఇలా.. ప్రతీ చిన్న విషయానికీ ఆత్మహత్యలే.వీరంతా పరిస్థితులను ఎదుర్కొనడానికి సరైన మానసిక సమతుల్యత లేని వారే. పరిపక్వత లేనివారే. సమాజం పట్ల అవగాహన, వ్యక్తుల తీరు తెన్నుల పట్ల కనీస స్పృహ, సహనం, ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకునే తత్వం ఏవీ నేటి తరానికి ఉండటం లేదు. తల్లి దండ్రులు, యూకేజీ నుంచి హాస్టల్‌ లో పడేస్తుంటే వారికి సమాజం పట్ల, మానసిక, అనుబంధాల పై అవగాహన ఉండదు. యుక్తా యుక్త విచక్షణ లేక పోవడం మరో కారణం. చిన్న వయసులోనుంచి తల్లి దండ్రులకు దూరంగా ఉన్న వారు అటాచ్ మెంట్లను కోరుకోరు. ఎవరితోనూ కలవరు.అయితే బాగా ఇండిపెండెంట్ గా లేదా పూర్తి అభద్రతతో ఉంటారు.దీనికి తోడు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే.

ఆత్మహత్యలకు కారణాలు..

తాము ఇష్టమైన వారిని కోల్పోవడం, ప్రేమించినవారు దూరం కావడం, వెక్కిరింత, ఎగతాళి, అవమానం, ప్రేమ వైఫల్యం,జీవితాన్ని కుదిపేసే సంఘటనలు అంటే విడాకులు, నిరుద్యోగం, రిటైర్ అవడం, లేదా ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడటం, లేదా జీవన కాలాన్ని హరించే రోగం వచ్చిందని తెలిసినప్పుడు,ఆర్థిక సమస్యలు,జైలు పాలవడం,తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భవతి అవడం, లేదా గర్భాన్ని కోల్పోయినప్పుడు,పూర్తిగా కొత్త వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు వారిని లైంగికంగా ఎద్దేవా చేయడం,కొన్ని మూర్ఖపు, బలవంతపు ఆచారాలు, కట్టుబాట్లు, లేదా బలవంతపు పెళ్లిళ్లు ఆత్మహత్య చేసుకోవాలన్న భావనలు బలంగా కలుగుతాయి. చనిపోతే ఈ బాధలు, వేదనలు ఉండవు అన్న ఆలోచనలే మనిషిని ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ఆత్మహత్య చేసుకుంటారని కాదు గానీ..బలహీన మనస్కులు, సెన్సిటివ్‌ మనస్తత్వం ఉన్నవారు కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్యం లేని వారు తనువు చాలించడానికి సిద్ధపడుతుంటారు. సాధారణంగా యువతలో ఈ సూసైడల్‌ టెండెన్సీ ఎక్కువగా ఉంటోందని వైద్య నిపుణులంటున్నారు.

ఎవరెవరికి రిస్క్?

కుటుంబంలో బలహీన మనస్కులు, ఆత్మ హత్యలు చేసుకున్న చరిత్రున్న కుటుంబానికి చెందిన వారు, లేదా అత్త మామలు, తల్లి దండ్రులు, తోబుట్టువులు , మేనమామలు ఇలా ఎవరో ఒకరి లైంగిక వేధింపులకు బలయిన వారు,మానసిక సమస్యలున్నవారికి పుట్టిన పిల్లలు, జైలుకెళ్లడం, దీర్ఘకాలిక జబ్బులకు గురైన వారు ఇలా..ఈ జోన్ లో ఉన్న వారందరినీ జీవితంలో ఎప్పుడో,ఏదో చిన్న సంఘటన.. అది వారి అహాన్ని దెబ్బ తీసేదైనా,మరేదైనా జరిగితే చాలు వీరిలో ఆత్మహత్య భావనలు పెరుగుతాయి. ఈ లక్షణాలు, నేపధ్యం ఉన్న వారి చుట్టుపక్కల వారు నిరంతరం వారిని గమనిస్తూ,ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి భరోసా కల్పించకపోతే బాధితుల బతుకు నరక ప్రాయమవుతుంది.

ఎలా గుర్తించాలి?

ఆత్మహత్య భావనలున్నవారు ఎక్కువగా ఎవరితోనూ కలవరు. ఏకాంతాన్ని ఇష్టపడతారు.ఎవరో నిరంతరం వెంటాడుతున్నట్లు, వేధిస్తున్నట్లు, ఎక్కడినుంచైనా, ఏ రూపంలోనైనా తమను ఏదో చేసేవయచ్చన్న నిరంతర ఆలోచనలు, భయం,ఆదుర్దా వెంటాడుతుంటాయి. తాము ఏం చేయలేకపోతున్నామని, ఎదుటి వారికి బర్డెన్ అయిపోయామని భావిస్తూ తమని తాము అంతం చేసుకోడానికి, తమకి తాము హాని చేసుకోడానికి కూడా వెనకాడరు.ఇలాంటి వారికి అందుబాటులో మారణాయుధాలు, అగ్ని ప్రమాదానికి లోను చేసే వస్తువులు, మందులు ఉంచకూడదు. చదువుకున్నవారు ఆత్మహత్య చేసుకోడానికి ఆన్ లైన్ లో మార్గాలు వెతుకుతుంటారు.స్నేహితులకు, కుటుంబానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా ఉంటారు.తరచుగా మద్యం, లేదా డ్రగ్స్ కి అలవాటు పడతారు.వీరి తిండి, నిద్ర వేళలు కూడా కొంచెం అబ్ నార్మల్‌ గానే ఉంటాయి.నిరంతరం ఆందోళనతో, ఏద ఆలోచిస్తూ, ఆతృతతో ఉంటారు. మరి కొందరు చాలా నిర్లక్ష్య భావనతో ఉంటారు.వారి మూడ్స్ తరచుగా మారిపోతుంటాయి.ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిని వారిని వెన్నంటి ఉండేవారు ఓ కంట గమనిస్తూ సర్ది చెప్పి, వారి ఆలోచనలను సరిచేసేందుకు ప్రయత్నించాలి. లేదంటే తర్వాత కాలంలో వారొక బర్డెన్ గా మారతారు. చివరకు మన మధ్యనే ఉంటూ మనకు తెలియకుండానే ప్రాణాలు తీసుకుంటారు. కాబట్టి మానసిక రోగులను అత్యంత జాగ్రత్తగా గమనించాలి. తీవ్రమైన ఒత్తిడి, లేదా డిప్రెషన్ లో ఉన్న వారితో సన్నిహితంగా మాట్లాడాలి. అలా మాట్లాడుతుంటేనే ఏదో ఒక దశలో వారి మనసులో అసంతృప్తిని బయటకు వెళ్ల గక్కుతారు. తద్వారా వారిలో ఆత్మహత్య భావనలు తగ్గుతాయి. తమ గోడు వినేవాళ్లు ఒకరు ఉన్నారన్న భరోసా కలుగుతుందన్నది వైద్య నిపుణులు చెబుతున్న మాట. అంతేకాదు ఆత్మహత్య చేసుకోవాలనే భావనలు వెంటాడుతుంటే ఆసరా,రోష్ని లాంటి సంస్థల ఫ్రీ కాల్‌ సెంటర్లున్నాయి. అవి ఫోన్ లోనే మనకు కౌన్సిలింగ్ ఇస్తాయి. ఈ సర్వీస్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఎవరికి బాధ చెప్పుకోలేని వారు కనీసం ఆ ఫోన్ సర్వీస్ సేవలనైనా వినియోగించుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆ బలహీన క్షణం నుంచి బయటపడితే వారు ఆత్మహత్య చేసుకోరని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com