గతనెల 3వవ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ సంఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఆ దుర్ఘటన తర్వాత సినిమా హీరో అల్లు అర్జున్‌తో పాటు..సినిమా నిర్మాతలు కూడా రేవతి ఇంటికి వెళ్లి ఆమె కుటంబాన్ని పరామర్శించి ఉండాలన్నారు. అంతేకాదు.. గాయపడ్డ బాలుడిని కూడా ఆసుపత్రికి వెళ్లి పలకరించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు.
ఈనెల 8వ తేదీన తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చే క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. తిరుమల చరిత్రలోనే జరిగిన ఈ అతిపెద్ద దుర్ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి, అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు టీటీడీ ఈవో, చైర్మన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఓ రకంగా డిమాండ్ చేశారు. అంతేకాదు.. మరణించిన కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి మరీ నష్టపరిహారం అందజేయాల్సిందేనన్నారు. బాధితుల దగ్గరికి వెళ్తే ఆ బాధ అర్థమవుతుందని కూడా వ్యాఖ్యానించారు.
ఈ రెండు సంఘటనలపైనా ఇలా స్పందించింది.. వ్యాఖ్యలు చేసింది.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ రెండు పరిణామాలపైనా పవన్ కల్యాణ్ స్పందనను అందరూ ఆహ్వానించారు. సామాజిక బాధ్యతను గుర్తు చేసిన పవన్ కల్యాణ్‌ఫై అభినందనల వర్షం కురిపించారు. సామాజిక బాధ్యత అంటే ఇలా ఉండాలని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
ఇక, తిరుమల తొక్కిసలాటపై ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసింది పిఠాపురంలో. అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆ సమయంలో అదే సభావేదికకు వెనుక వైపున ఓ బాధిత కుటుంబం పవన్ కల్యాణ్ కోసం పడిగాపులు పడింది. ఏదో గంటా రెండుగంటలు కాదు.. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కుటుంబం.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు వెయిట్ చేసింది. అలా.. అని వాళ్లంతట వాళ్లే అక్కడికి రాలేదు. పవన్ కల్యాణ్ వాళ్లను పరామర్శిస్తారని, మీ ఇంటికి రావడానికి ఆయనకు సమయం లేదని.. అందుకే మిమ్మల్నే ఆయన పాల్గొనే సభకు తీసుకు రమ్మన్నారని ప్రభుత్వ అధికారులు, జనసేన ప్రతినిధులు వాళ్లను తీసుకొచ్చారు. మరి.. రోజంతా పవన్ కల్యాణ్‌కోసం పడిగాపులు కాస్తే.. ప్రయోజనం దక్కిందా అంటే అదీ లేదంటున్నారు బాధితులు. కనీసం తమను పవన్ కల్యాణ్ పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి.. పవన్ కల్యాణ్ కోసం రోజంతా వేచిచూసిన వాళ్లెవరో తెలుసా? గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన చరణ్, మణికంఠ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. అదే వేదికమీద నుంచి తిరుమల తొక్కిసలాట మృతుల కుటుంబసభ్యులను ఇంటికే వెళ్లి పరామర్శించాలని, వాళ్ల దగ్గరికే వెళ్తే బాధ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందని వ్యాఖ్యానించిన పపన్ కల్యాణ్.. రామ్‌చరణ్ సినిమా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తుండగా ప్రమాదంలో చనిపోయిన తన ఫ్యాన్స్‌ను పరామర్శించే.. వాళ్ల కుటుంబసభ్యులను ఓదార్చే తీరు ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే.. సామాజిక బాధ్యత, బాధితులకు ఓదార్పు అనేది.. ఎదుటివాళ్లకు చెప్పేందుకే తప్ప.. తాను అనుసరించేందుకు కాదా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కల్యాణ్ తమను కనీసం పలకరించలేదని చరణ్, మణికంఠ తల్లిదండ్రులు చెబుతున్నారు. కేవలం యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయాడని అంటున్నారు. పిల్లలు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే.. తమ దగ్గరికి రాకుండా.. అధికారులను పంపించి తమనే అక్కడికి పిలిపించారని, ఆయనమీద గౌరవంతో తాము వెళ్లామని.. ఆయన చాలా బాధపడుతున్నారని, తమను కూడా ఓదారుస్తారని అనుకున్నామని, కానీ.. రోజంతా పడిగాపులు కాసేలా ఎదురుచూపులు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము లక్షలు, కోట్లు అడగలేదని, కేవలం రెండు నిమిషాలు అయనతో బాధను పంచుకోవాలనుకున్నామని తమ మనసులో మాట చెప్పారు. తమను పలకరిచనప్పుడు, పలకరించేందుకు సమయం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు ఎలాగూ పోయారని. ఇప్పుడు తాము కూడా చనిపోతామని మృతుల తల్లిదండ్రులు చెప్పడం చూస్తే ఎదుటివాళ్ల కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు.
ఈనెల 4వ తేదీన రామ్‌చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగొస్తుండగా.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మెగా ఫ్యామిలీ అభిమానులు చరణ్, మణికంఠ.. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో, ఆ ఇంట్లో తీరని విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులంతా పుట్టెడు దుఃఖంలో ఉండగా.. పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యారు. ఎలాగూ పిఠాపురం రావడంతో.. బాధితుల కుటుంబసభ్యులను పిలిపించారు. అయితే, పవన్ కల్యాణ్ వచ్చే సమయం పరిగణనలోకి తీసుకోకుండా ఉదయమే చరణ్, మణికంఠ కుటుంబసభ్యులను సభావేదిక దగ్గరికి తీసుకొచ్చారు అధికారులు. దీంతో, ఓవైపు పిల్లలను కోల్పోయిన బాధ.. మరోవైపు పవన్ కల్యాణ్ ఎప్పుడొస్తాడో తెలియని పరిస్థితిలో నరకం అనుభవించారు కుటుంబసభ్యులు.
వాస్తవానికి పిఠాపురంలో అధికారిక కార్యక్రమానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. చరణ్, మణికంఠ ఇంటికే వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్లను సంక్రాంతి సంబరాల దగ్గరికి పిలిపించారు. పిలిపించిన వాళ్లను పలకరించి.. కాసేపు మాట్లాడి.. వాళ్ల గుండెల్లో బరువు దించేలా వ్యవహరించినా ప్రశంసనీయంగా ఉండేది. కానీ, అక్కడికి పిలిపించి మరీ వాళ్లను అవమానించిన తీరు అభిమానుల్లో కూడా ఆగ్రహానికి కారణమవుతోంది. మరి.. పవన్ కల్యాణ్ చెప్పే మానవత్వం ఇతరులకు చెప్పేందుకే తప్ప.. ఆయన పాటించేందుకు కాదా? అన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి.