– సీఎం కామెంట్స్‌తో ఐఏఎస్‌ల పని తీరుపై చర్చ
– ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతీసేలా కొందరు కలెక్టర్ల తీరు
– పదిమంది కలెక్టర్లపై త్వరలో యాక్షన్
– ఐఏఎస్‌లపై కొందరు మంత్రుల ఫిర్యాదు
– ఇక సెట్ చేయాల్సిందే అంటున్న రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లపై సీరియస్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పాలన వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే కలెక్టర్లు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య వచ్చినట్లుగా తెలుస్తుంది. కలెక్టర్ల సమావేశంలో మిగతా విషయాలు ఎలా ఉన్నా కలెక్టర్ల వ్యవహారం పైనే సీఎం మొదటిసారిగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని.. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కామెంట్స్ ఎందుకు చేశారు ? అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అనే అంశంపై చర్చ ప్రారంభమైంది. కరీంనగర్ ,నిజామాబాద్, మహబూబబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో సమస్యలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా.. వాటికి క్రెడిట్ రాకపోవడానికి కలెక్టర్లే కారణమనే వాదన వినిపిస్తుంది. గురుకుల పాఠశాల్లో విద్యార్థులకు కొత్త మెనూ పెట్టి.. మెస్‌చార్జీలు గణనీయంగాపెంచి.. మంచి భోజనం అందిస్తున్నామన్న ఇమేజ్ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కలెక్టర్లుహాస్టళ్లలో నిద్ర చేయాలని ఆర్డర్లు ఇస్తే దానికి అనుగుణంగా కలెక్టర్లు తమ వంతు పాత్ర పోషించలేదన్నది సీఎంఓ వర్గాల అభిప్రాయం. కచ్చితంగా కలెక్టర్లు తనిఖీలు నిర్వహించి పాఠశాల్లో పరిస్థిని స్వయంగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ మెజార్టీ కలెక్టర్లు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలనున్నప్పటికీ వివిధ కారణాలు చూపిస్తూ కింది స్థాయి అధికారులను పంపించారు తప్ప కలెక్టరు, ఎస్పీ స్థాయి అధికారులు వెళ్లలేదని నివేదికలు వచ్చాయి.
అదేవిధంగా భూసేకరణ విషయానికి వస్తే.. కొందరు కలెక్టర్లు ఈ విషయంలో యాక్టివ్‌గా లేరు అనేది ప్రభుత్వ పెద్దల వాదన. గతంలో జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం జరిగేవని .. ఇప్పుడు ఏ చిన్న సమస్య అయినా రాష్ట్రస్థాయి సమస్యగా ఎందుకు మారుతుందని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ల వల్లనే ఈ సమస్య ఎదురవుతోందన్నది వాళ్ళ అభిప్రాయం.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఇకనుంచి సీరియస్‌గా ఉండాలని అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది. స్వయంగా సీఎం జిల్లాల పర్యటనల ద్వారా గట్టి మెసేజ్ వెళుతుందని ఆయన భావిస్తున్నారు . అదేవిధంగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఏ రకంగా ఉండాలి? మంత్రులను ఎలా గౌరవించాలన్న విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కొందరు మంత్రులు కూడా తమ శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఏమాత్రం సహకరించట్లేదని ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.