టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జట్టుకి ఫీల్డింగ్ వైఫల్యాలు గోరుచుట్టుపై రోకలిపోటులా మారాయి. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే… నాలుగో టెస్టులో యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ మూడు క్యాచ్ లు డ్రాప్ చేయడంతో ఇండియాకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఒకవేళ అవే పట్టుకొని ఉంటే, ఆస్ట్రేలియా ఎప్పుడో ఆల్ అవుట్ అయ్యేది. టార్గెట్ తక్కువ ఉండేది. టీమ్ ఇండియాకి గెలిచే అవకాశాలు మెరుగయ్యేవని అంటున్నారు.
ఇంతకీ ఆ క్యాచ్ లు ఏమిటంటే…లెగ్ సైడ్ గల్లీలో యశస్వి ఫీల్డింగ్ చేస్తున్నాడు. బుమ్రా బౌలింగు వేస్తున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తనిచ్చిన సింపుల్ క్యాచ్ ను యశస్వి జార వదిలేశాడు. ఆ బాల్ చేతి వేళ్లకు తాకి కిందకు వెళ్లిపోయింది. తను అలర్ట్ గా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కామెంటేటర్లు వ్యాక్యానించారు.
రెండో క్యాచ్ డ్రాప్ ఎక్కడంటే, 40 ఓవర్ జరుగుతోంది. లబుషేన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎడాపెడా కొడుతున్నాడు. ఈ సమయంలో తనిచ్చిన క్యాచ్ ను గల్లీలోనే మళ్లీ యశస్వి వదిలిపెట్టేశాడు. పక్కనే కొహ్లీ ఉన్నాడు. తను అలా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ అరిచి గగ్గోలు పెట్టాడు. బుమ్రా నిరాశగా వెళ్లిపోయాడు.
మూడో క్యాచ్ డ్రాప్ ఎక్కడంటే, ఈసారి రోహిత్ శర్మ ఏం చేశాడంటే యశస్విని ఫీల్డింగు నుంచి తప్పించి, సిల్లీ పాయింట్ వద్ద వేశాడు. ఈసారి రవీంద్ర జడేజా బౌలింగు చేస్తున్నాడు. కెప్టెన్ కమిన్స్ బ్యాటింగు చేస్తున్నాడు. ఈ క్రమంలో తనిచ్చిన సింపుల్ క్యాచ్ ను అంతే సింపుల్ గా వదిలేశాడు.
నాలుగో రోజు మొత్తమ్మీద యశస్వి తీవ్ర డిప్రెషన్ లో ఉన్నట్టు అర్థమైంది. బహుశా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అనవసరంగా రన్ అవుట్ అయి, టీమ్ ఇండియాని కష్టాల పాలు చేశాననే భావనలో ఉన్నట్టున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లేదంటే అంత సింపుల్ క్యాచ్ లు, కుర్రవాడైన యశస్వి వదిలేయడమేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా ఒకవేళ … ఆ క్యాచ్ లు పట్టి ఉంటే, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 228 పరుగులు చేసేది కాదని అంటున్నారు. ఎందుకంటే 173 పరుగుల వద్ద 9 వికెట్ పడింది. ఆఖరి వికెట్ కి లయన్, బోలాండ్ ఇద్దరు కలిసి 53 పరుగులు జోడించారు. దీంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి చేరుకుంది. టీమ్ ఇండియాకి ఛాలెంజ్ విసిరే స్థితికి చేరుకుంది.