అవకాశాలు వదిలేసిన టీమ్ ఇండియా
ఆస్ట్రేలియాలో గెలుపు కోసం ఎంతో పట్టుదలతో ఆడుతున్న టీమ్ ఇండియాకి నాలుగో టెస్టులో మూడుసార్లు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. వాటిని వదిలేయడంతో ఆస్ట్రేలియా మళ్లీ పట్టు బిగించడం మొదలుపెట్టింది. ఒకవైపున టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు జట్టు సమష్టి వైఫల్యాలతో తలబొప్పి కడుతోంది. ఇంకోవైపు బౌలర్లు కృషి చేస్తున్నా వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతోంది.
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే… నాలుగో టెస్టులో టీమ్ ఇండియా పట్టు బిగుస్తుందనుకునే లోపే ఏవో అవాంతరాలు జట్టుని వెంటాడుతున్నాయి. అవి జట్టు విజయావకాశాలను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. మెల్ బోర్న్ టెస్టులో అలాంటి ఘటనలు మూడు జరిగాయి.
నిజానికి ఫస్ట్ ఇన్నింగ్స్ ని టీమ్ ఇండియా ఆశావహ దృక్పథంతోనే మొదలుపెట్టింది. ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 152 పరుగులతో పటిష్టంగా కనిపించింది. మరో 5 ఓవర్లలో రెండోరోజు ముగ్గుస్తుందనగా యశస్వి జైశ్వాల్ అనవసరమైన పరుగునకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇది మొదటి గేమ్ ఛేంజ్ పాయింట్ అని చెప్పాలి. ఇక్కడే జట్టు ఆటతీరు పిల్లిమొగ్గలేసింది.
చివరికి ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 159 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అలా జైశ్వాల్ జట్టుని ఇబ్బందుల్లోకి నెట్టాడు. అయితే తను చేసిన 82 పరుగులు మాత్రం ఎంతో విలువైనవని చెప్పాలి. నిజానికి తను కంటిన్యూ చేసి ఉంటే, మళ్లీ 150 పరుగులు పైనే చేసేవాడని కామెంట్లు వినిపించాయి
రెండో అవకాశం ఏమిటంటే… యశస్వి జైశ్వాల్ ఫీల్డింగ్ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మూడుసార్లు చేతిలోకి పండులా వచ్చిన క్యాచ్ లను జారవిడిచాడు. అవేవీ కష్టతరమైనవి కూడా కాదు. ఒకవేళ అవి పట్టుకుని ఉంటే, వాళ్లు త్వరగా ఆల్ అవుట్ అయ్యేవాళ్లు…దీంతో మనకు విజయావకాశాలు మెండుగా ఉండేవి. అందువల్ల ఫీల్డింగులో తన స్థానంలో మరొకరిని పెట్టాలనే డిమాండ్లు నెట్టింట వినిపిస్తున్నాయి.
అన్నింటికి మించి దురదృష్టం ఏమిటంటే నాలుగోరోజు ఆఖరి ఓవర్ ను బుమ్రా వేశాడు. అయితే తన బౌలింగులో లయన్ క్యాచ్ ఇస్తే రాహుల్ అందుకున్నాడు. కానీ అది నోబాల్ కావడంతో భారత అభిమానులు ఉసూరుమన్నారు. చివరికి చెప్పొచ్చేదేమిటంటే, ఆస్ట్రేలియాలో నాలుగో టెస్టులో టీమ్ ఇండియాకి ఇంకా టైమ్ కలిసి రాలేదనే చెప్పాలి. ఏమైనా అదృష్టం ఉందంటే, అది ఆస్ట్రేలియావైపే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.