28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

యనమల ఆరాటం… పట్టించుకోని అధిష్టానం…

రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే కొన్ని చొట్ల సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామ కృష్ణుడు…సైకిల్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పదవిలో ఉన్నారు. చంద్రబాబు తర్వాత నెంబర్ 2 స్థాయిలో ఆయనకు ప్రాధన్యత దక్కింది. బిసి కార్డు పూర్తి స్థాయిలో వాడుకున్న నేతగా యనమల రాజకీయ నేపథ్యం , పార్టీలో ప్రాధాన్యం కొనసాగుతూ వచ్చాయి.

మొదటిసారి యనమల మంత్రివర్గంలో లేకుండా ప్రభుత్వం కొనసాగుతోంది. దీంతో యనమల రెండు రోజలుకు ఒకసారి మీడియా సమావేశాలు పెట్టడం విపక్ష నేత జగన్ ను విమర్శించే సాకుతో సొంత పార్టీపైనే సెటైర్లు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత కొంత కాలంగా యనమల చేస్తున్న కామెంట్లు.. టీడీపీని ఇరుకున పెట్టేలా ఉంటున్నాయని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తనదైన స్టైల్లో టీడీపీని యనమల ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా.. అని టీడీపీ వర్గాల్లో టాక్ సాగుతోంది.

తిరిగి ఎమ్మెల్సీ కోసమా.. లేక రాజ్యసభ సీటుకు తన పేరును కనీసం ప్రతిపాదనలోకి కూడా తీసుకోవడం లేదనా… ఇలా పలు విధాలుగా చర్చ జరుగుతోంది. యనమల కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురికి పార్టీ అవకాశం ఇచ్చింది.

యనమల కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివ్య కోసం సోదరుడు యనమల కృష్ణుడిని పార్టీకి దూరం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఏలూరు ఎంపిగా పుట్టా మహేష్ యాదవ్ కు పార్టీ టికెట్ రావడంలో యనమల మంత్రాంగం పనిచేసింది. అల్లుడికి టికెట్ ఇప్పించుకున్నా.. ఏలూరు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపి మాగంటి బాబు, సీనియర్ నేత గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ కూడా అసంతృప్తికి లోనయ్యారు.

మైదుకూరు ఎమ్మెల్యేగా వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. కుటుంబంలో ముగ్గురికి వివిధ పదవులు దక్కినా యనమలకు పదవుల ఆరాటం తీరటం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిలో ఉన్న యనమల కన్ను ఇప్పుడు ఢిల్లీ మీద పడింది.

టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2009లో ఓటమి చెందిన ఇతను 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్‌గా, అధికారంలో లేనప్పుడు పీఏసీ చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు.

1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ, పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించాడు. 1985-89 మధ్య మంత్రిగా, 1989-94లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా, 1995-99లో శాసనసభ స్పీకర్‌గా కొనసాగాడు. సమైక్యాంధ్రప్రదేశ్ శాసనమండలిలో విభజన జరిగే వరకు ప్రధాన ప్రతిపక్ష (టీడీపీ) నాయకుడిగా కొనసాగారు.

ఎన్టీఆర్‌ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో స్పీకరుగా ఉన్నారు. 1999-2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2004-08 మధ్య కాలంలో తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు.

యనమల కోెరిన వాటికి కాదనకుండా పార్టీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడు ఆయన కన్ను రాజ్యసభ సీటు మీద పడిందని చర్చ జరుగుతోంది. మరోవైపు యనమలను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదనే చర్చ కూడా సాగుతోంది. ఆయన కుటుంబానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత పార్టీ పరంగా దక్కిందని… ఇక గొంతెమ్మ కోరికలు తీర్చలేమని  మంత్రి నారా లోకేష్ సీనియర్ల వద్ద కుండబద్దలు కొట్టినట్టు విశ్వసనీయ సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com