బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుపై బీఆర్‌ఎస్ నేత, మాజీ పోలీసు అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు తన సర్వీసులో ఇంత చెత్త కేసు చూడలేదన్నారు. తాను రెండేళ్ల పాటు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించానని చెప్పారు. అదే అనుభవంతో కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన కేసులోని అన్ని వివరాలను రెండు సార్లు లోతుగా పరిశీలించానన్నారు. ప్రపంచంలో ఇంత వరస్ట్ కేసు ఇంకొకటి ఉండదన్నారు.
ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా సదరు 55 కోట్ల రూపాయల నుండి ఒక్క పైసా కూడా కేటీఆర్ జేబుల్లోకి వెళ్లినట్టు నిరూపించలేకపోయారని, పాపం ఆరు నెలలు శ్రమించి.. ప్రజలు వాళ్లకిచ్చిన విలువైన సమయాన్ని నీళ్లపాలు చేశారని దుయ్యబట్టారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఛీఫ్ ఇంజినీరు బీ ఎల్ ఎన్ రెడ్డి ల మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో నిరూపించలేకపోయారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఇప్పుడు వాళ్లు చూపించగలిగేదంతా.. ప్రొసీజర్ వయోలేషన్స్ మాత్రమే అన్నారు. వీటికి శాఖాపరమైన ఎంక్వైరీ వేసి నిజమేంటో తెలుసుకుంటే సరిపోయేతన్నారు. సచివాలయంలో ఇలాంటి ప్రొసీజర్ వయోలేషన్స్ ప్రతి డిపార్ట్‌మెంట్‌లో రోజూ జరుగుతుంటాయన్న ఆర్‌ఎస్.. అలా చేయకపోతే అనుకున్న లక్ష్యం నెరవేరదని, ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఇలాంటి వయోలేషన్స్‌ను తరువాత కేబినెట్‌లో పెట్టి క్రమబద్ధీకరిస్తారని, వీటి మీద స్పష్టత లేని వాళ్లకు ప్రతీది వయోలేషన్ లాగానే కనిపిస్తుందని ఆరోపించారు. ఇందులో ఖర్చు పెట్టిన 55 కోట్ల రూపాయలు.. రాష్ట్రానికి వందల కోట్ల రాబడి కోసమే పెట్టామన్నారు. ఈ అంశంపై ఏమైనా అనుమానాలు ఉంటే అన్నీ అసెంబ్లీ సాక్షిగా నివృత్తి చేస్తా నని కేటీఆర్ అంటున్నా మొఖం చాటేసుకొని.. పిరికిపందల్లా ఏసీబీకి ఫైలు అప్పగించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఖజానాకు ఏమైనా నష్టం జరిగిందంటే, అది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్లనే అని ఆరోపించారు. ఎవరినడిగి ఈ ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దు చేసారని ప్రశ్నించారు. రేవంత్ ఈ నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల కమిటీతో చర్చించారా? దీనిపై కేబినెట్ అనుమతి తీసుకున్నారా? అని నిలదీశారు. రేవంత్‌వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయిందన్నారు. ఇవన్నీ గమనిస్తే.. అసలు ఈ ఫార్ములా-ఈ కేసులో రేవంత్ రెడ్డి ని ఏవన్‌గా చేర్చాలని, కేటీఆర్‌ను కాదని అన్నారు.