చంద్రబాబు నోట.. రిటైర్‌మెంట్ అనే మాట వినబడింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ఉప రాష్ట్రపతి ఆసీనులై ఉన్న సభా వేదిక మీద చంద్రబాబు రిటైర్‌మెంట్ మాట ఎత్తారు. మామూలుగా కాదు.. ‘నేను కూడా రేపు రిటైర్ కావాలి కాబట్టి.. ఇప్పటటినుంచే ప్రిపేర్ అవుతున్నా’ అని స్పష్టంగా వ్యాఖ్యానించారు.
విశాఖలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు.. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు గురించి మాట్లాడుతూనే.. తన రిటైర్ మెంట్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తాను రిటైర్ అయ్యాక ఎలా ఉండాలో దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు దగ్గర తెలుసుకున్నానని చెప్పారు.
దగ్గుబాటికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ.. ‘ఇటీవల ఒకసారి కలిశాం.. కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలొచ్చాయ్.. యాక్టివ్ లైఫ్‌లో ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ రిటైర్ లైఫ్ మాదిరిగా యాక్టివ్‌గా ఉన్నారు. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైమ్? అని అడిగాను… ఎందుకంటే.. ఇప్పుడు రేపు నాక్కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటినుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి… ఆయన ఒకటే చెప్పాడు. చాలా హ్యాపీగా ఉన్నా.. నిద్ర లేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటా. వచ్చిం తర్వాత మనవరాళ్లు, మనవళ్లతో ఆడుకుంటా. అక్కడినుంచి కాసేపు గాసిప్స్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. మళ్లా పేకాటకు పోతాడు. మధ్యాహ్నం అయితే పేకేటకు పోతా. .ఆడొక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతది. హ్యాపీగా వచ్చి నిద్రపోతా.. వాటే వండర్‌ఫుల్ లైఫ్.’ అని చంద్రబాబు చెప్పగానే.. మరో విషయం మర్చిపోయావంటూ దగ్గు బాటి వెంకటేశ్వర్ రావు కల్పించుకున్నారు.
దీంతో.. చంద్రబాబు గుర్తుకు తెచ్చుకొని ‘ఆ.. అదికూడా చెప్పాడు.. నేను మర్చిపోయాను.. పిల్లలకు రాత్రిళ్లు ఓ స్టోరీ చెప్పి ఈయన హ్యాపీగా నిద్రపోతాడట. అదేమాదిరిగా ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు.’ అని దగ్గుబాటి దిన చర్య గురించి చంద్రబాబు ఆసక్తి కరంగా వివరించారు.
చంద్రబాబు బహిరంగ సభా వేదికపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రభుత్వాన్ని చంద్రబాబు లీడ్ చేస్తున్నా.. నడిపిస్తున్నదంతా నారా లోకేష్ అనే వాదన మొదటినుంచీ వినిపిస్తోంది. ప్రతి అంశంలోనూ నారా లోకేష్ మార్క్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే.. ఆయన త్వరలోనే పూర్తిగా క్రియాశీల రాజకీయాలకు దూరమవుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని, ప్రభుత్వాన్ని లోకేష్‌కు అప్పగించి తప్పుకుంటారా? అన్న చర్చ సాగుతోంది. స్పష్టంగా తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడటంతో..ఇక చంద్రబాబు రిటైర్ అవుతారన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.