32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

10 స్థానాలకు ఉపఎన్నికలు తప్పవా?

తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది.. తర్వాత పరిణామాలతో అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరినీ అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నేతలు పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌కు ముందుగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు.. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పీకర్‌ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటీఆర్‌తోపాటు పలువురు సుప్రీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీని ఆదేశించింది. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అనర్హతపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు.. ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రెటరీ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, నోటీసుల్లో ఎప్పటి వరకు వివరణ ఇవ్వాలో పేర్కొనలేదని సమాచారం. మరోవైపు.. నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేలు తమకు గడువు కావాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సుప్రీ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు జారీ అయిన వారిలో దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు.

నియోజకవర్గాల అభివృద్ధి కోసం అంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్షంలోకి దూకడం సర్వసాధారణంగా జరిగే పరిణామమే. ఈ కారణంగా ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే క్రిష్ణ మోహన్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు కాకుండా శాసన మండలి సభ్యులు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది?

ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచాక, వివిధ కారణాలను సాకుగా చూపెట్టి మరో రాజకీయ పార్టీలో దూకడాన్ని అడ్డుకునేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూలును చేర్చారు. అందులో 101, 102, 190, 191 ఆర్టికల్స్ లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరంగా పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీ బి ఫారంపై గెలిచి, మరో పార్టీలో చేరి, విప్ ను ధిక్కరించిన సందర్భాల్లో స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చు. అయితే, దీని నుంచి బయట పడేందుకు మెజారిటీ రాజకీయ పార్టీలు తమ పార్టీలో చేరిన వారిని తమ ఖాతాలో వేసుకోకుండా వారి మద్దుతును మాత్రం కూడగడుతుంటాయి. అంతే కాకుండా ఒక పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సభ్యులు పార్టీ మారితే, దానిని విలీనంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు.

నాడు బీఆర్ఎస్ చేసింది అదే :

2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీ శాసనసభా పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా ఆ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేల సంఖ్యను తమ ఖాతాలో వేసుకుంది. శాసనమండలిలోనూ ఇదే జరిగింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. 2018 శాసనసభ ఎన్నికల్లో రెండో సారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంది. రెండింట మూడొంతుల మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారడంతో కాంగ్రెస్ శాసన సభాపక్షం, బీఆర్ఎస్ శాసన సభాపక్షంలో వీలినం జరిగినట్లు ప్రకటించారు. దీంతో, ఫిరాయింపుల చట్టం వర్తించలేదు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నట్టే.. కాంగ్రెస్ పార్టీ సైతం అదే బాటలో ఉంది. బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటోంది. కానీ, బీఆర్ఎస్ శాసన సభాపక్షాన్ని విలీనం చేసుకునేంత సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను టార్గెట్ చేసి స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తమ పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచిన సభ్యుడు ఇతర పార్టీలోకి వెళ్లడాన్ని నిరసిస్తూ ఫిర్యాదు చేస్తే, సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేసే నిర్ణయాధికారం సభాపతికి ఉంటుంది.ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ శాసన సభాపక్షం తరపున స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్‌ పార్టీ హై కోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన సభ్యులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేసినా, చర్యలు తీసుకోవడంలో విఫలమైనా కోర్టుల్లో సవాల్ చేసే వెసులుబాటును పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కల్పించింది. దీని ఆధారంగానే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని శాసన సభా కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com