25.2 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

టీడీపీ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా?

ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీలో సీనియర్లు క్రమంగా కనుమరుగవుతున్నారు. అనుభవజ్ఞులు, సీనియర్లను కూడా అధిష్టానం పక్కన బెడుతోంది. బదులుగా పూర్తి స్థాయిలో కొత్త నాయకులు, యువతకు అవకాశం కల్పిస్తోంది. నారా లోకేష్‌ నేతృత్వంలో ఈ ప్రక్షాళన కొనసాగుతోందన్నది దాదాపు అందరూ చెబుతున్న మాట. యువరక్తాన్ని పార్టీలోకి ఎక్కిస్తున్నామని ముఖ్యనేతలు దీనిని సమర్థించుకుంటున్నార. ప్రభుత్వంలో కీలక పదవులు కూడా యువకులకే దక్కుతున్నాయి. గత యేడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువ శాతం మంత్రి పదవులు యువకులకు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు మాత్రమే దక్కాయి. ప్రస్తుత జనరేషన్‌కి విశ్లేషించుకుంటే ఇది సమంజసంగానే కనిపిస్తుంది. కానీ, ఈ పరిణామాలతో కాస్త ఇబ్బంది కూడా తొంగి చూస్తోంది.

తమకు ప్రాధాన్యత తగ్గడం, పార్టీ నుంచి కనీసం పిలుపు, పలకరింపు కూడా లేక పోవడంతో చాలామంది సీనియర్ నాయకులు సైలెంట్ అయిపోయారు. దీంతో, కీలకమైన అంశాల్లో గానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు గానీ, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. సంక్షోభాలు ఎదురైనప్పుడు సమస్యలను పరిష్కరించి పార్టీకి అనుకూలంగా పరిస్థితులను మార్చగలిగే ట్రబుల్ షూటర్స్ టీడీపీలో కరువయ్యారంటున్నారు. ఏదైనా ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు.. ముఖ్యంగా రాజకీయాల్లో అనుకోని పరిణామం జరిగినప్పుడు పార్టీకి అనుకూల పరిస్థితులను కల్పించాలంటే దానికి కచ్చితంగా అనుభవం, నేర్పు, నైపుణ్యం ఉన్న నాయకులు కావాలి. ప్రత్యర్థి పార్టీలు విమర్శించినప్పుడు.. కౌంటర్‌ ప్రెస్‌మీట్ పెట్టి ఇటువైపు నుంచి ఎదుటివాళ్లను డిఫెన్స్‌లో పడేయ గలిగే సామర్థ్యం ఉన్న నాయకులు కావాలి. కానీ, కేవలం విమర్శలకు, ప్రతి విమర్శలు మాత్రమే సరిపోవు. విపక్షాల విమర్శలను పార్టీకి అనుకూలంగా మార్చే నైపుణ్యం సీనియారిటీతోనే వస్తుంది. ప్రస్తుత టిడిపిలో అది లోపించిందన్న అభిప్రాయం అధిష్టానంలో కూడా వచ్చిందంటున్నారు.

ఒకప్పుడు చంద్రబాబుకి అండగా ఎర్రన్నాయుడు, కడియం శ్రీహరి, అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు, లాల్ జన్ బాషా లాంటి సీనియర్‌ నేతలు ఉండేవారు. తర్వాత కాలంలో దేవినేని ఉమా, తలసాని శ్రీనివాస్ యాదవ్, మోత్కుపల్లి నరసింహులు ఇలా జాబితా పెద్దగానే ఉండేది. అయితే, ప్రస్తుతం చూస్తే.. పార్టీలో ఉన్నవాళ్లు ఎక్కువ మంది వ్యాపారస్థులు, యువకులు కావడంతో ఆ ట్రబుల్ షూటర్ స్థానం లోపించిందన్న మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ ఇటీవల కాలంలో రెండు సంఘటనల్లో సీనియరిటీ లేమిని ఎదుర్కొంది. మొదటిది గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కు సంబంధించిన అంశం. రెండోది గుంటూరు మిర్చి యర్డు అంశం. గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను, రిజర్వేషన్ వివాదాన్ని నారా లోకేష్ దృష్టికి సరైన సమయంలో అధికారులు తీసుకెళ్లలేదని అంటారు. ఆ తర్వాత జరిగిన తతంగం అందరికీ తెలిసిందే. తాము ఇచ్చిన జీవో 77కు విరుద్ధంగా తామే ఇచ్చిన నోటిఫికేషన్ కావడంతో విపక్ష వైసీపీ దీనిలో పెద్దగా కలుగజేసుకోలేదు. కానీ, టీడీపీకి చాలా ఇబ్బంది కలిగించే పరిణామాలే గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో ఉన్నాయి. దాదాపు 90 వేలమంది అభ్యర్థులకు సంబంధించిన అంశం కావడంతో వారిలో ఎంత మందిలో ఇంకా దీనిపై వ్యతిరేకత ఉందో బయటకు తెలియని పరిస్థితి. ఈ ఇష్యూని డీల్ చేయడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే చెప్పాలంటున్నారు విశ్లేషకులు. రెండోది గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లి జగన్ నిరసన తెలిపిన అంశం. మిర్చి ధర పెంపు అంశంలో తన నిరసన తర్వాతే కేంద్రంతో మాట్లాడిన కూటమి ప్రభుత్వం దానిని ఆచరణలోకి తెచ్చిందని ఆ క్రెడిట్ తమదేనని వైసీపీ సొంతం చేసుకుంది. దీనిపై ఒకటి రెండు ప్రెస్‌మీట్‌లు పెట్టి జగన్‌ని విమర్శించడం మినహా.. పెద్దగా చేసింది ఏమీ లేదంటున్నారు సీనియర్లు. ఇలాంటి అంశాల్లోనే సీనియారిటీ అనేది పనికొస్తుందని చెబుతున్నారు. వీటి మాదిరిగానే ఏదైనా ఇష్యూ సీరియస్‌ అయినప్పుడు అన్ని వివరాలను పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రజల్లో నెగెటివ్‌ టాక్ రాకుండా చూడటం అనేది సీనియర్ల వల్ల మాత్రమే అయ్యే పని అని చెబుతున్నారు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ.. జగన్‌ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటోంది. మరి.. ఇలాంటి సమయంలో సీనియర్లు అందర్నీ పక్కన పెట్టేయడం వంటి టీడీపీ అధిష్టానం వేస్తున్న స్టెప్పు సరైనదో కాదో భవిష్యత్ రాజకీయాలే నిర్ణయిస్తాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com