తెలంగాణలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ హైదరాబాద్‌కు దీటుగా శివారులో ఫోర్త్ సిటీ నిర్మిస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే దానిని ఫ్యూచర్ సిటీగా పిలుస్తున్నారు. హైదరాబాద్ రాజధాని నగరంతో పోటీ పడేలా ఫోర్త్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ బోతున్న ‘ఫ్యూచర్ సిటీ’ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ-ఎఫ్‌సీడీఏ పేరిట కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలతో ఫ్యూచర్ సిటీ పరిధిని నిర్ణయించింది ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీలో ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ/ పరిశ్రమలు, ఐటీ వాణిజ్య శాఖ మంత్రి వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైదరాబాద్ డీటీసీపీ సభ్యులుగా ఉంటారు. అథారిటీ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఓఆర్‌ఆర్ బయట ఉన్న ప్రాంతాలు.. ముఖ్యంగా శ్రీశైలం జాతీయ రహదారి- నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. విమానాశ్రయం, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ ఆర్థిక, పారిశ్రామిక సమూహాలతో అభివృద్ధి చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 765.28 చదరపు కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ ఏరియా కోసం ఆయా గ్రామాలను కూడా నిర్ధారించింది. ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి వచ్చే 36 గ్రామాలు గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండేవి. వాటిని ఎఫ్‌సీడీఏకు బదిలీ చేశారు. ఎఫ్‌సీడీఏ పరిధిలోకి మొత్తంగా 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఫ్యూచర్ సిటీ పరిధిలో చేర్చిన గ్రామాలు :
అమన్‌గల్ మండలం:
1. కోనాపూర్ 2. రామనూతుల;
ఇబ్రహీంపట్నం మండలం:
3. కప్పపహాడ్ 4. పోచారం 5. రామ్‌రెడ్డిగూడ 6. తులేకలాన్ 7. తుర్కగూడ 8. ఎలిమినేడు 9. ఎర్రకుంట 10. తడ్లకల్వ;
కడ్తాల్ మండలం:
11. చెర్లికొండపట్టి కల్వకుర్తి 12. చెర్లికొండపట్టి పడ్కల్ 13. ఏక్‌రాజ్‌గూడ 14. కడ్తాల్ 15. కర్కాల్ పహాడ్ 16. ముద్విన్;
కందుకూరు మండలం:
17. దాసర్లపల్లి 18. అన్నోజిగూడ 19. దెబ్బడగూడ 20. గూడూర్ 21. గుమ్మడవల్లె 22. కందుకూరు 23. కొత్తూర్ 24. గఫూర్‌నగర్ 25. లేమూర్ 26. మాదాపూర్ 27. మీర్‌ఖాన్‌పేట 28. మొహమ్మద్ నగర్ 29. ముచ్చర్ల 30. పంజాగూడ 31. రాచలూర్ 32. సర్వరావులపల్లె 33. తిమ్మాయిపల్లె 34. తిమ్మాపూర్;
మహేశ్వరం మండలం:
35. మొహబ్బత్‌నగర్ 36. తుమ్మలూర్;
మంచాల మండలం:
37. ఆగపల్లి 38. నోముల 39. మల్లికార్జునగూడ;
యాచారం మండలం:
40. చౌదరిపల్లి 41. గున్‌గల్ 42. కొత్తపల్లి 43. కుర్మిద్ద 44. మేడిపల్లి 45. మల్కాజిగూడ 46. మొగుళ్లవంపు 47. నక్కర్త 48. నానక్‌నగర్ 49. నంది వనపర్తి 50. నజ్దిక్ సింగారం 51. తక్కెళ్లపల్లి 52. తాటిపర్తి 53 తులేఖుర్ద్ 54. యాచారం 55. చింతపట్ల 56. నల్లవెల్లి.