- అయినా అందరి కంటే ముందే టీటీడీ పాలకమండలి క్షమాపణలు చెప్పింది
- నా వ్యాఖ్యలు తప్పుగా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ అన్నట్లు ప్రచారం చేస్తున్నారు
- నా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదు – బీఆర్ నాయుడు
టీటీడీ చైర్మన్ గా తన పేరు ప్రకటించిన మరుక్షణం నుంచి బీఆర్ నాయుడు ప్రతి చర్య, ప్రతి స్టేట్మెంట్ వివాదాస్పదమవుతున్నాయి. ఇంకా పదవి చేపట్టకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ చైర్మన్ గా తన పేరు ప్రకటించిన వెంటనే శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తానని, తాను ఐదేళ్ళుగా తిరుమల కొండకు వెళ్లలేదని ఇలా పూర్తి అవగాహన లేకుండా ఇష్టమొచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చి వివాదలు కొని తెచ్చుకోవడమే కాకుండా టీటీడీ అధికారులకు కూడా కంటగింపు అయ్యారు బీఆర్ నాయుడు. గురువారం తిరుపతిలో తొక్కిసలాట ప్రాంతాలల్లో సీయం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొందరపాటు వల్ల తాము ఎన్ని ఇంబ్బందులు పడుతున్నామో ఏకరువు పెట్టారు ఈవో శ్యామలరావు. ఇక తొక్కిసలాటపై డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ప్రజలకు స్వయంగా క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈవో శ్యామలరావు, జెఈవో వెంకయ్య చౌదరి, చైర్మన్ బీఆర్ నాయుడులు కూడా చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా శుక్రవారం మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… నామోషీకి పోకుండా ఈ ముగ్గురు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని అదేశించినట్లు మాట్లాడారు. అయితే దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ క్షమాపణలు చెప్పడం మంచిదే కానీ చెప్పినంత మాత్రాన చనిపోయినవారు తిరిగి వస్తారా అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఎవరో ఏదో మాట్లాడితే దానిపై స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో టీటీడీ పీఆర్ఓ ద్వారా దానికి ఖండన విడుదల చేయించారు బీఆర్ నాయుడు. తాను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వ్యాఖ్యానిస్తే దానిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గా నా వ్యాఖ్యలను ఆపాదించడం భావ్యం కాదని ఆ ప్రకటనలో బీఆర్ నాయుడు అన్నారు. మొన్న జరిగిన తొక్కిసలాట ఘటనకు వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, చనిపోయినవారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పానని ఆ ప్రకటనలో బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని బీఆర్ నాయుడు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.