రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రధాన పధకాలను ఈనెల 26 వతేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్లర్లకు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీయం మాట్లాడారు. భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ, రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించిన మీదటే, ఈ పధకాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని భట్టి వివరించారు. ఇప్పటికే, ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసామని, ఈ పధకాల అమలులో ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారుల ఎంపికను, ప్రతీ ఉమ్మడి జిల్లాలో ఇంచార్జి మంత్రులు ఇందిరమ్మ కమిటీలతో చర్చించిన మీదటే చేపట్టాలని కలెక్లర్లను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం నిర్ణయించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీ ల ద్వారా ప్రకటించాలన్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో 22000 కోట్ల రైతు రుణ మాఫీలను చేసాం. ఈ వివరాలను కూడా ప్రతీ గ్రామంలో ప్రకటించాలని సూచించారు. ఈ నాలుగు పధకాలకు సంబంధించి సవివరమైన మార్గ దర్శకాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని… ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క ఆదేశించారు.