-
కేసీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని మంచి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన మంచిపనులు ఉంటే వాటిని చెప్పుకుంటే బాగుండేదని, కానీ చేసిన పొరపాట్లను ప్రజల ముందు ఒప్పుకుంటే ఇంకా మంచిదని వ్యాఖ్యానించారు.
“దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేని కేసీఆర్ కనీసం ప్రతిపక్షనేత హోదా అయినా దళితుడికి ఇవ్వచ్చు కదా?” అంటూ ఆయన నిలదీశారు. అంతేకాదు, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయలేదని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “కేసీఆర్ నిజమైన సూచనలు ఇచ్చుంటే, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మేం చేసేవాళ్లం,” అన్నారు. అలాగే, “డేట్ మీరు ఫిక్స్ చేయండి. అన్ని అంశాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం,” అంటూ కేసీఆర్కు బహిరంగ సవాల్ విసిరారు.
బీఆర్స్ పాలనలో సర్పంచులకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, సర్పంచ్ల పదవీకాలం కేసీఆర్ హయాంలోనే ముగిసిందని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల బకాయిలు కూడా అదే కాలంలో పెరిగినట్లు గుర్తు చేశారు. “కేసీఆర్ పాలనలోనే ప్రజాస్వామ్య హక్కులను హరించారు. కాంగ్రెస్ సభలకు ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లను బెదిరించారు. ఆర్టీసీ బస్సులను అద్దెకివ్వకుండా అడ్డుకున్నారు,” అంటూ విమర్శించారు. “మేం ఇబ్బంది పెట్టాలనుకుంటే, మీ సభలు జరిగేవే కావు,” అని అన్నారు.
“80 వేల పుస్తకాలు చదివిన మీ జ్ఞానం అసెంబ్లీలో వినిపిస్తుందని భావించాం, కానీ మీరు అసెంబ్లీలోకి రావడం లేదు. పదేళ్ల పాటు కనీసం సచివాలయానికి రాకుండా దొరల పాలన కొనసాగించారు,” అంటూ మండిపడ్డారు. “రైతులకు వరి వేయొద్దని చెప్పి, స్వయంగా మీ ఫామ్ హౌస్లో వరి పండించారు. ఇది ఏరకమైన చర్య? ” అని ప్రశ్నించారు. దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్పై కూడా మండిపడ్డారు.
“ధనిక తెలంగాణను ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో నింపిన వ్యక్తి కేసీఆర్,” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ విలన్గా చూపించాలనే కుట్రలో ఉన్నారని ఆరోపించారు. సోనియాగాంధీకి సహస్రాంగా నమస్కరించిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించడం ద్వంద్వ ధోరణి అని విమర్శించారు.
ఫోన్ టాపింగ్ విషయంపైనా పొంగులేటి తీవ్రంగా మండిపడ్డారు. “ప్రజాస్వామ్యాన్ని మాట్లాడే నైతికత కేసీఆర్కు లేదు. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య సంబంధాలను ఫోన్ టాపింగ్ ద్వారా నాశనం చేసిన కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంపై ఉపదేశాలు ఇవ్వడం విడ్డూరం,” అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా రైతుబంధు అమౌంట్ను 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా, యూనివర్సిటీ భూముల విక్రయాలపై బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు. “యూనివర్సిటీ భూములు ఎక్కడ అమ్మాము చూపించండి,” అని సవాల్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వమేనని, వైన్ షాపుల టెండర్లు ముందస్తుగా పిలిచింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. “సన్నబియ్యం పథకం గురించి కూడా కేసీఆర్ సభల్లో మాట్లాడితే బాగుండేది,” అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వ నివేదిక త్వరలో వస్తుందని, విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు.