తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో శాంతి చర్చల కమిటీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న దిశగా ఈ సమావేశం జరిగింది.
శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మావోయిస్టులతో కాల్పుల విరమణ కోసం కేంద్రాన్ని ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని, శాంతిభద్రతల సమస్యగా పరిగణించబోమని స్పష్టం చేశారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఆయన సూచనలు, సలహాలను తీసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మంత్రివర్గ సభ్యులతో చర్చించిన అనంతరం, శాంతి చర్చలపై తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీకి భరోసా ఇచ్చారు.