నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? జూన్ లో పదవి ఇస్తారా? లేదంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగబాబు ఏ సభలోను సభ్యుడు కాదు. ముందుగా ఎమ్మెల్సీని చేసి.. ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారన్నది ప్రశ్న. మరోవైపు బిజెపికి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి మరో మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి పట్టుబడుతోంది. బిజెపికి ఒకే ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు. సుజనా చౌదరితో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. క్యాబినెట్‌లో ఉన్నది ఒకే ఒక్క మంత్రి పదవి. అందుకే ఆ పదవి జనసేనకు ఇవ్వాలా? బిజెపికి ఇవ్వాలా? అనే మీమాంసలో ఉన్నారు చంద్రబాబు.
ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి. అది ఇప్పుడు ఇస్తారా? కొద్ది రోజుల తర్వాత ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు పదిమంది కొత్తగా గెలిచినవారే. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సీనియర్లకు అవకాశం కల్పించి జూనియర్లను పక్కన పెడతారని టాక్ నడుస్తోంది.
అంతవరకు నాగబాబు మంత్రి పదవి తేలే అవకాశం కనిపించటం లేదు. ప్రస్తుతమున్న 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన చెప్పి… వారి బదులు సీనియర్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎన్నికల సమయం కావడంతో సీనియర్లకు కీలక పదవులు అప్పచెపుతారని తెలుగు తమ్ముళ్లు చర్చిస్తున్నారు.
విస్తరణలో ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. మొన్న ఎమ్మెల్సీల ఎంపికలో అనూహ్యంగా సోమువీర్రాజు పేరు తెరమీదకు తీసుకువచ్చిన బిజెపి… అదే స్పీడుతో సోము వీర్రాజుకు అమాత్య పదవి ఇప్పిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సుజనా చౌదరీ, విష్ణుకుమార్ రాజు మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నారు. అయితే పార్టీలో సీనియర్, సంఘ్ ఆశిస్సులు ఉన్న సోము వీర్రాజుకు మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని నాయకత్వం యోచిస్తోంది. సోమువీర్రాజుకు మంత్రి పదవి కట్టబెడితే పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కుతుందనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో వస్తుందని భావిస్తున్నారు.
ఇలా వివిధ రకాల విశ్లేషణలతో నాగబాబుకు దక్కుతుందా…బిజెపి ఎగురేసుకుపోతుందా వేచి చూడాలి.